ఆ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు గుడ్ న్యూస్

by Muthe.Rajitha |

రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అంగన్‌వాడీ సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఆ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అంగన్‌వాడీ సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అర్హులైన అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్ల నుంచి వచ్చే వినతులను తక్షణమే పరిశీలించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఈ ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిబంధనను విధించింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు సదరు టీచర్ గాని హెల్పర్ గాని రాజీనామా చేసిన తర్వాత.. సదరు అంగన్‌వాడీ కేంద్రంలో వారి స్థానంలో ఇంకా కొత్త నియామకం జరగని సందర్భాల్లో మాత్రమే వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవడానికి అవకాశం కల్పించనున్నారు. ఒకవేళ అప్పటికే అక్కడ కొత్త అభ్యర్థిని నియమించి ఉంటే ఈ ఉత్తర్వులు వర్తించవని స్పష్టం చేసింది.

రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పందిస్తూ.. "స్త్రీ, శిశు సంక్షేమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు పోషిస్తున్న పాత్ర అమూల్యమైనది. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని చిన్న పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారాన్ని అందిస్తూ, వారి ఆరోగ్య సంరక్షణను చూసుకునే అత్యంత కీలక భాగస్వాములు వీరు. వారి సమస్యలను పరిష్కరించడానికి, వారికి అండగా నిలవడానికి మన ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది" అన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అంగన్‌వాడీ సంఘాలు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల బరిలో నిలిచి ఓటమి పాలై, ఉపాధి కోల్పోయిన అనేక మంది అంగన్‌వాడీ కుటుంబాలకు ఈ నిర్ణయం ద్వారా తిరిగి ఆర్థిక భరోసా లభించనుంది.

Next Story