- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తక్కువ ధరకు బంగారం అంటూ రూ.20 కోట్లు కొట్టేసిన లేడీ పోలీస్
తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామంటూ సామాన్య ప్రజలతో పాటు తోటి పోలీసులనే బురిడీ కొట్టించి రూ.20 కోట్లకు పైగా వసూలు వసూలు చేసింది ఓ లేడీ ఇన్స్పెక్టర్.

దిశ, వెబ్ డెస్క్ : తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామంటూ సామాన్య ప్రజలతో పాటు తోటి పోలీసులనే బురిడీ కొట్టించి రూ.20 కోట్లకు పైగా వసూలు చేసిన ఒక భారీ మోసం తమిళనాడు రాజధాని చెన్నైలో వెలుగుచూసింది. ఈ కుంభకోణంలో చెన్నై రాయపురం మహిళా పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టరుగా విధులు నిర్వహిస్తున్న షీలా మేరీపై పోలీసులు కేసు నమోదు చేయడం డిపార్ట్‌మెంట్‌లో తీవ్ర సంచలనంగా మారింది.
ఖాకీ అండతో 'గోల్డ్' స్కీమ్.. పోలీస్ వాహనంలోనే పంపిణీ!
పోలీసుల దర్యాప్తు వివరాల ప్రకారం.. ఇన్‌స్పెక్టర్ షీలా మేరీ తన బంధువైన ప్రభుమణి అనే వ్యక్తి ద్వారా ఈ మోసానికి తెరలేపింది. బంగారంపై పెట్టుబడి పెడితే అతి తక్కువ కాలంలోనే ఊహించని రీతిలో భారీ లాభాలు వస్తాయని, మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకు బంగారు నాణేలు (Gold Coins) ఇప్పిస్తామని నమ్మబలికారు. 2023 నుంచి 2024 వరకు ప్రభుమణి నడుపుతున్న ఈ నకిలీ పెట్టుబడి సంస్థలో సుమారు 200 మందికి పైగా చేరారు. బాధితుల్లో నమ్మకం కలిగించడం కోసం నిందితులు అత్యంత తెలివిగా ప్రవర్తించారు. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో చాలా మంది బాధితులకు ఇన్‌స్పెక్టర్ షీలా మేరీ అధికారిక 'పోలీస్ వాహనం'లోనే ప్రభుమణి స్వయంగా వెళ్లి బంగారు నాణేలను పంపిణీ చేశాడు. ప్రభుత్వ వాహనంలోనే నేరుగా డెలివరీ ఇవ్వడంతో సదరు సంస్థకు పోలీస్ శాఖ రక్షణ ఉందనే నమ్మకంతో వందలాది మంది క్యూ కట్టారు. వీరి నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని సొంత శాఖకు చెందిన కానిస్టేబుళ్లు, పలువురు ఉన్నతాధికారులు కూడా ఇందులో కోట్లాది రూపాయలు పెట్టుబడిగా పెట్టారు.
బోర్డు తిప్పేసిన సంస్థ
వందలాది మంది నుంచి దాదాపు రూ.20 కోట్ల వరకు వసూలు చేసిన తర్వాత, నిందితులు తమ అసలు స్వరూపాన్ని బయటపెట్టారు. 2024 మధ్యలో అకస్మాత్తుగా ఆ సంస్థకు బోర్డు తిప్పేసి, ఆఫీసు మూసివేసి ప్రభుమణి రాత్రికి రాత్రే పారిపోయాడు. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు, తోటి పోలీసు సిబ్బంది చెన్నై ఆర్థిక నేరాల విభాగం (Economic Offences Wing) పోలీసులను ఆశ్రయించి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదులపై లోతుగా దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక బృందం ఎట్టకేలకు ప్రధాన నిందితుడు ప్రభుమణిని గుర్తించి అరెస్ట్ చేసింది. అతడిని విచారించగా ఈ మొత్తం దందా వెనుక ఇన్‌స్పెక్టర్ షీలా మేరీ కీలక సూత్రధారి అని, ఆమె అండదండలతోనే ఈ వసూళ్ల పర్వం సాగిందని ఆధారాలు లభించాయి. దీంతో ప్రస్తుతం ఆర్థిక నేరాల విభాగం పోలీసులు ఇన్‌స్పెక్టర్ షీలా మేరీపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసి, ఆమె పాత్రపై పూర్తిస్థాయి దర్యాప్తును వేగవంతం చేశారు. డిపార్ట్‌మెంట్‌లో ఉంటూ తోటి సిబ్బందినే ముంచిన ఈ లేడీ ఇన్‌స్పెక్టర్ వ్యవహారం చెన్నై పోలీస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.






