డబ్బులు డిమాండ్.. సీన్ కట్ చేస్తే జైలుపాలు!

by Jakkula.Mamatha |   (  Updated:2026-06-08 08:39:33  IST  )

లంచానికి ఆశపడి కొంత మంది పోలీసు అధికారులు నిందితులుగా అడ్డంగా దొరికిపోతున్నారు.

డబ్బులు డిమాండ్.. సీన్ కట్ చేస్తే జైలుపాలు!
X

దిశ, సిటీ క్రైమ్: లంచానికి ఆశపడి కొంత మంది పోలీసు అధికారులు నిందితులుగా అడ్డంగా దొరికిపోతున్నారు. వారు నమోదు చేసిన కేసులలోనే డబ్బులు డిమాండ్ చేస్తూ ఏసీబీ అధికారులకు చిక్కుతున్నారు. పోలీసులు అక్యూజ్డ్‌గా నమోదైన కేసులలో నిందితులే బాధితులుగా ఉండడం గమనార్హం. మొత్తానికి లంచం పోలీసులకు జైలు మంచాన్ని పరిచయం చేస్తుంది. ఎన్నో కలలు కని, సమాజానికి మంచి చేయాలనే లక్ష్యం పెట్టుకుని ,పోటీ పరీక్షల్లో గెలిచి సాధించిన ఉద్యోగాన్నికి లంచం మాయలో పడి నిందితులుగా నమోదయ్యి పరువు తీసుకుంటున్నారు. నేరం చేసిన నిందితుడే దర్యాప్తు చేస్తున్న అధికారులను లంచం కోసం సతాయిస్తున్నాడని ఏసీబీని ఆశ్రయించి ఆ అధికారి ధన దాహాన్ని బయటపెట్టడంతో పాటు వారిని కటకటాల వెనక్కి నెట్టుతున్న విచిత్ర పరిస్థితి నెలకొంది. ఈ విధంగా లంచం డిమాండ్ చేస్తూ పలువురు అధికారులు పోలీసు ప్రతిష్టను దిగజారుతున్నారు. లంచాలను డిమాండ్ చేసి నిందితులు గా మారిన పోలీసు అధికారుల సంఖ్య ఈ ఆరు నెలలోనే 10కి ఉన్నాయని ఏసీబీ అధికారుల రికార్డుల్లో స్పష్టమవుతుంది. నిందితుల నుంచి లంచాలను డిమాండ్ చేసి నిందితులుగా మారిన పోలీసు అధికారుల సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

రూ.9 లక్షలు డిమాండ్, రూ.5 లక్షలు ముట్టినా..

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు చెందిన ఇన్‌స్పెక్టర్ బత్తుల మహేందర్ తాను దర్యాప్తు చేసిన ఓ సైబర్ ఫ్రాడ్ కేసులో నిందితుడి కుటుంబ సభ్యులు, అతని స్నేహితుల పేర్లు నమోదు చేస్తానని బెదిరించాడు. అలా జరగొద్దంటే రూ.9 లక్షలు లంచం డిమాండ్ చేశాడు. రూ.5 లక్షలు తీసుకున్నాడు. ఇంకా నాలుగు లక్షల కోసం వేధిస్తుండగా బాధితుడు(ఫ్రాడ్ కేసులో నిందితుడు) ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు బత్తుల మహేందర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని రిమాండ్ కు పంపించారు. దీంతో ఇన్‌స్పెక్టర్ బత్తుల మహేందర్ ఏసీబీ కేసులో నిందితుడయ్యాడు.

రూ.30 వేల కోసం సతాయింపులు..


బోయిన్పల్లి పీఎస్ కు చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్ కిరణ్ నందిత, కానిస్టేబుల్ విజయ్ కుమార్ ఓ కేసులో నిందితుడికి సంబంధించిన బెయిల్ కండీషన్స్‌లో వెసులుబాటు కలిగించేందుకు రూ.30 వేల లంచం డిమాండ్ చేశారు. లంచం డబ్బు ఇవ్వడంలో ఆలస్యమవుతున్న సందర్భంలో ఈ ఇద్దరి వేధింపులు పెరిగాయి. దీంతో బాధితుడు(నిందితుడు) ఏసీబీ అధికారులకు ఈ ఇద్దరు పోలీసు ఆఫీసర్‌లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టించి వారిని నిందితులుగా బుక్కైయ్యేలా చేశాడు.

రూ.5 లక్షలు డిమాండ్.. 2 తీసుకుని..

శంషాబాద్ ఆర్‌జీఐ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సంపతి కనకయ్య, ఎస్ఐ సిద్ధేశ్వర్‌లు ఓ కేసులో నిందితుడికి మద్దతుగా చార్జీషీటను దాఖలు చేసేందుకు రూ.5 లక్షలు డిమాండ్ చేశారు. ఆ చార్జీషీటులో వారి కుటుంబ సభ్యుల పాత్ర లేకుండా కేసును నీరుగార్చే విధంగా ఉండేలా చూసుకుంటామని ఒప్పందం. రూ.5 లక్షల లంచం డబ్బు కోసం ఈ ఇద్దరు వేధిస్తుండగా బాధితుడు(నిందితుడు) ఏసీబీ అధికారులను ఆశ్రయించి రూ.2 లక్షలు లంచాన్ని ఇస్తూ ఇద్దరు పోలీసు ఆఫీసర్ లను పట్టించాడు. దీంతో కేసు దర్యాప్తు చేస్తున్న ఇద్దరు ఆఫీసర్ జైలు పాలైయ్యారు.

రోడ్డు మీద లంచం తీసుకుంటూ..

మల్కాజ్గిరి పోలీసు కమిషనరేట్ సైబర్ క్రైం పోలీసు స్టేషన్ లో పనిచేస్తున్న ఆర్ఎస్ఐలు ప్రమోద్ గౌడ్, జతావత్ బాబు నాయక్ లు వారు దర్యాప్తు చేస్తున్న సైబర్ మోసం కేసులో నిందితుడిని అరెస్టు చేయకుండా నోటీసు ఇచ్చే విధంగా చేయాలంటే లక్ష రూపాయాలను డిమాండ్ చేశారు. ఇలా లంచం కోసం పోలీస్ ఆఫీసర్ లు పదే పదే ఫోన్ చేయడంతో బాధితుడు(నిందితుడు) ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చి ఎల్బీనగర్ చౌరస్తాలో లక్ష రూపాయలు ఇవ్వడం తో ఇద్దరు పోలీసులు అడ్డంగా దొరికిపోయి జైలు పాలయ్యారు.

రూ.60 వేలు డిమాండ్ చేసి.. రూ.40 వేలు తీసుకుంటూ..


బీఎన్ 35 కింద నోటీసులు జారీకి సంబంధించిన వ్యవహారంలో వికారాబాద్ జిల్లా ఉమెన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బి.సరోజ, ఎస్ఐ హెచ్.రాణిలు నిందితుడి నుంచి రూ.60 వేల లంచాన్ని డిమాండ్ చేశారు. నిందితుడు తాను ఇచ్చుకోలేనని రూ.40 వేలకు కుదుర్చుకున్నాడు. దీనికి కూడా సమయం ఇవ్వకుండా వేధిస్తుండడంతో ఇద్దరు ఆఫీసర్‌లపై అతను ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టించాడు. ఈ సంఘటనతో ఇద్దరు ఆఫీసర్ లు జైలు పాలయ్యారు. గత రెండు, మూడు సంవత్సరాల ఏసీబీ కేసుల రికార్డులను పరిశీలిస్తే 20 మందికి పై పోలీసులు నిందితులుగా విచారణను ఎదురుకుంటున్నారని స్పష్టమవుతుంది.

Next Story