- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తవ్వుకుంటూ పోతే మీ పాత చిట్టా బయటపెడతాం
సంగారెడ్డి పట్టణంలో నిర్వహించిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం రాజకీయ వేడిని రాజేసింది.

దిశ, సంగారెడ్డి : సంగారెడ్డి పట్టణంలో నిర్వహించిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం రాజకీయ వేడిని రాజేసింది. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి మధ్య జరిగిన రాజకీయ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ కార్యక్రమంలో ముందుగా మాట్లాడిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నలు సంధించారు. మహిళలకు హామీ ఇచ్చిన తులం బంగారం, నెలకు రూ.2,500 ఆర్థిక సాయం ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. అలాగే వృద్ధాప్య పెన్షన్లను రూ.4 వేలకు పెంచుతామని చెప్పిన హామీని ఎప్పుడు నెరవేరుస్తారని సభా వేదికగా నిలదీశారు. దీనిపై స్పందించిన టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ఎమ్మెల్యేకు అదే వేదికపై ఘాటుగా సమాధానమిచ్చారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంపై మోపిన భారీ అప్పులను తీర్చడానికే ప్రస్తుతం ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తోందని ఆమె పేర్కొన్నారు. గత పాలకుల ఆర్థిక విధానాల కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా మారిందని విమర్శించారు. అయితే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తోందని నిర్మల జగ్గారెడ్డి స్పష్టం చేశారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
వేదికపైనే ఎమ్మెల్యేకు ఘాటు కౌంటర్..
ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ను ఉద్దేశించి నిర్మల జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో చర్చనీయాంశంగా మారాయి. "హామీల గురించి మీరు తవ్వుకుంటూ పోతే.. గత పదేళ్ల మీ పాలనలో ఇచ్చిన హామీలు, చేసిన పనులను కూడా మేము తవ్వాల్సి వస్తుంది" అంటూ ఆమె వ్యాఖ్యానించారు. రాజకీయ విమర్శలకు అతీతంగా ప్రజా అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు.






