పాక్‌తోనే భారత్ తొలి పోరు.. మహిళల టీ20 వరల్డ్ కప్‌ షెడ్యూల్ విడుదల

by Malleboina Mahesh |

మహిళల టీ20 ప్రపంచకప్ 2026 షెడ్యూల్ విడుదల అయింది. జూన్ 14న పాకిస్థాన్‌తో భారత్ తొలి పోరు. జూలై 5న లార్డ్స్‌లో ఫైనల్ జరగనుంది.

పాక్‌తోనే భారత్ తొలి పోరు.. మహిళల టీ20 వరల్డ్ కప్‌ షెడ్యూల్ విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: ఇంగ్లాండ్, వేల్స్ వేదికగా జరగనున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. ఈ మెగా టోర్నమెంట్‌ కు సంబంధించిన మ్యాచులు జూన్ 12 నుంచి జూలై 5 వరకు జరగనున్నాయి. మొత్తం 12 జట్లు తలపడే ఈ టోర్నీలో భారత్ గ్రూప్-Aలో చోటు దక్కించుకుంది. లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జూలై 5న ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు.

ఈ ప్రతి ష్ఠాత్మకమైన టోర్నమెంట్‌లో భారత మహిళల జట్టు తన పోరాటాన్ని జూన్ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగే హై-వోల్టేజ్ మ్యాచ్‌తో ప్రారంభించనుంది. గ్రూప్ దశలో భారత్ వరుసగా నెదర్లాండ్స్ (జూన్ 17), దక్షిణాఫ్రికా (జూన్ 21), బంగ్లాదేశ్ (జూన్ 25) జట్లతో తలపడి, చివరగా జూన్ 28న పటిష్టమైన ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:00 గంటలకు ప్రారంభం కానున్నాయి. టీ20 సిరీస్ విజయంతో మంచి ఊపులో ఉన్న భారత్, ఈ ప్రపంచకప్‌లోనూ అదే జోరును కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

సెమీఫైనల్స్, ఫైనల్ అర్హత ప్రక్రియ

ఈ మహిళల ప్రపంచకప్ మెగా టోర్నమెంట్‌లో మొత్తం 12 జట్లు రెండు గ్రూపులుగా తలపడతాయి. ఒక్కో జట్టు మొత్తం ఐదు మ్యాచులను ఆడనున్నాయి. గ్రూప్ దశ ముగిసే సమయానికి పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. జూన్ 30న జరిగే మొదటి సెమీఫైనల్‌లో గ్రూప్-A టాపర్, గ్రూప్-B లో రెండో స్థానంలో నిలిచిన జట్టుతో తలపడుతుంది. జూలై 2న జరిగే రెండో సెమీఫైనల్‌లో గ్రూప్-B టాపర్, గ్రూప్-A లో రెండో స్థానంలో నిలిచిన జట్టుతో పోటీపడుతుంది.

గ్రాండ్ ఫైనల్

సెమీఫైనల్స్‌లో విజేతలుగా నిలిచిన రెండు జట్లు జూలై 5న లండన్‌లోని ప్రసిద్ధ లార్డ్స్ మైదానంలో జరిగే గ్రాండ్ ఫైనల్‌లో తలపడతాయి. ఒకవేళ నాకౌట్ మ్యాచ్‌లు టై అయితే, ఫలితం తేలే వరకు సూపర్ ఓవర్ల ద్వారా విజేతను నిర్ణయిస్తారు. అలాగే వర్షం వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆట నిలిచిపోతే, ఐసీసీ నిబంధనల ప్రకారం సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లకు 'రిజర్వ్ డే' సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ప్రపంచ ఛాంపియన్లుగా అవతరించాలంటే భారత్ తన గ్రూప్‌లో టాప్-2లో నిలవడం అత్యంత కీలకం.

Next Story