ICC T20 World Cup-2026: భారత్‌లో ఆడే ప్రసక్తే లేదు.. ఐసీసీకి తేల్చి చెప్పిన బంగ్లాదేశ్

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-13 13:18:16  IST  )

భారత్, శ్రీలంక సంయుక్త వేదికలుగా వచ్చే నెల 7 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌ (ICC T20 World Cup)పై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.

ICC T20 World Cup-2026: భారత్‌లో ఆడే ప్రసక్తే లేదు.. ఐసీసీకి తేల్చి చెప్పిన బంగ్లాదేశ్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్ (India), శ్రీలంక (Srilanka) సంయుక్త వేదికలుగా వచ్చే నెల 7 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌ -2026 (ICC T20 World కప్-2026)పై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. భారత్‌లో అడుగుపెట్టే విషయంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) తన పట్టు వీడడం లేదు. తాజాగా ఇవాళ ఐసీసీ అధికారులతో జరిగిన కీలక వీడియో కాన్ఫరెన్స్‌లో బీసీబీ తన నిర్ణయాన్ని కుండబద్దలు కొట్టినట్లు తెలిపింది. భారత్‌లో తమ ఆటగాళ్లకు, అధికారులకు ప్రాణహాని ఉందని, అందుకే తమ లీగ్ మ్యాచ్‌లను తటస్థ వేదికలైన శ్రీలంక, పాకిస్థాన్ మార్చాలని బీసీబీ అధ్యక్షుడు మొహమ్మద్ అమీనుల్ ఇస్లాం డిమాండ్ చేశారు.

అయితే, భారత్‌లో భద్రతపై అంతర్జాతీయ నిపుణులతో సమీక్ష నిర్వహించామని, రిస్క్ చాలా తక్కువగా ఉందని ఐసీసీ వివరించింది. షెడ్యూల్ ఇప్పటికే ఖరారైనందున వేదికల మార్పు అసాధ్యమని పేర్కొంది. కోల్‌కతా, ముంబై కాకుండా బంగ్లాదేశ్ మ్యాచ్‌లను దక్షిణ భారత్‌లోని చెన్నై, తిరువనంతపురానికి మార్చే ఆలోచనను ఐసీసీ సూచించినప్పటికీ, బీసీబీ అందుకు అంగీకరించలేదు. ఇండియా అంటే ఇండియాయే.. అక్కడ ఏ నగరమైనా తమకు సురక్షితం కాదని బంగ్లాదేశ్ స్పోర్ట్స్ అడ్వైజర్ అసిఫ్ నజ్రుల్ కామెంట్ చేశారు. ఒకవేళ బంగ్లాదేశ్ తన నిర్ణయానికి కట్టుబడి టోర్నీ నుంచి తప్పుకుంటే, ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చే అవకాశం ఉందంటూ అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఐసీసీ ఈ విషయంలో మరో రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

Next Story