ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం

by Malleboina Mahesh |   (  Updated:2026-02-17 06:54:08  IST  )

ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్‌ ఎన్నికకు ఉద్రిక్తతల నడుమే ఓటింగ్ జరగింది. ఈ క్రమంలో 3వ వార్డు అభ్యర్థి 15 ఓట్లతో చైర్మన్ గా ఎన్నికయ్యాడు. కాగా వైస్ చైర్మన్ ఎన్నిక శుక్రవారం జరగనుంది.

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. సోమవారం వివిధ కారణాలతో వాయిదా పడ్డా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఈ రోజు కూడా అత్యంత రసవత్తరంగా సాగింది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఓటింగ్ ప్రక్రియ ను ప్రారంభించిన అధికారులు.. చేతులెత్తి (Open Ballot) చైర్మన్‌ను ఎన్నుకోవాలని సూచించారు. అయితే, దీనికి కాంగ్రెస్ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, రహస్యంగా ఓటింగ్ నిర్వహించాలని గొడవకు దిగారు. మరోవైపు, ఎన్నికల నియమావళి ప్రకారమే ఓటింగ్ జరగాలని బీఆర్ఎస్ కౌన్సిలర్లు పట్టుబట్టడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

ఈ క్రమంలో ఉద్రిక్తత పెరిగి కాంగ్రెస్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ కౌన్సిలర్లపై దాడులకు దిగారు. మున్సిపల్ కార్యాలయం వద్ద తోపులాట జరగడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఇరు పార్టీల మధ్య ఘర్షణలు జరుగుతున్నప్పటికీ, రిటర్నింగ్ అధికారి పట్టుదలతో ఓటింగ్ ప్రక్రియను కొనసాగించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎన్నికల ప్రక్రియ పూర్తి చేశారు.

చివరికి ఉద్రిక్త పరిస్థితుల నడుమే జరిగిన ఓటింగ్‌లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకోగా.. 3వ వార్డు మెంబర్ టేకుల సుదర్శన్ రెడ్డి 15 ఓట్లతో మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ ఎన్నిక శుక్రవారానికి వాయిదా వేశారు. ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడిన పరిస్థితుల్లో కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించి బీఆర్ఎస్ ఈ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.

Next Story