నాకు టికెట్ నిరాకరించలేదు.. నేనే తప్పుకున్నాను: అన్నామలై సంచలన వివరణ

by Malleboina Mahesh |

ఎన్నికల పోటీపై అన్నామలై క్లారిటీ! టికెట్ నిరాకరించలేదని, తానే తప్పుకున్నానని వెల్లడి. రాష్ట్రవ్యాప్తంగా కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం.

నాకు టికెట్ నిరాకరించలేదు.. నేనే తప్పుకున్నాను: అన్నామలై సంచలన వివరణ
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత కె. అన్నామలై (K. Annamalai) పేరు లేకపోవడంపై వస్తున్న ఊహాగానాలకు ఆయన స్వయంగా తెరదించారు. శనివారం చెన్నైలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఇప్పటికే పార్టీ హైకమాండ్‌కు స్పష్టం చేసినట్లు వెల్లడించారు. తాను ఏ నియోజకవర్గం నుండి కూడా పోటీ చేయబోనని ఇప్పటికే పార్టీ కోర్ కమిటీకి లిఖితపూర్వక లేఖ ఇచ్చానని, అందుకే తన పేరు అభ్యర్థుల జాబితాలో లేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే తాను ఒక నియోజకవర్గానికే పరిమితం కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీయే (NDA) అభ్యర్థుల విజయం కోసం పని చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

అలాగే తన నిర్ణయాన్ని గౌరవించినందుకు బీజేపీ అగ్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు టికెట్ నిరాకరించారనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, ఇది కేవలం తన వ్యక్తిగత నిర్ణయమేనని అన్నామలై స్పష్టతనిచ్చారు. ఇదిలా ఉంటే బీజేపీ విడుదల చేసిన 27 మంది అభ్యర్థుల జాబితాలో అన్నామలై పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఏప్రిల్ 23న జరగబోయే ఈ ఎన్నికల్లో కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ (అవినాశి), తమిళిసై సౌందరరాజన్ (మైలాపూర్) వంటి కీలక నేతలు బరిలో ఉన్నప్పటికీ, అన్నామలై కేవలం పార్టీ కార్యకర్తగా (Karyakarta) క్షేత్రస్థాయిలో ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ఎన్డీయే కూటమిని 210 స్థానాల్లో గెలిపించడమే తన లక్ష్యమని అన్నామలై ప్రకటించారు.

Next Story