హైదరాబాద్ మెట్రో కథ మళ్లీ మొదటికే.. 'SBI క్యాప్స్' చేతికి భవితవ్యం!

by Malleboina Mahesh |

హైదరాబాద్ మెట్రో స్వాధీన ప్రక్రియకు కేంద్రం కొర్రీ.. ఐఆర్ఎఫ్‌సీ (IRFC) లోన్ నిలిచే ఛాన్స్, 'SBI క్యాప్స్' నివేదిక కోసం మరో 6 నెలల నిరీక్షణ!

హైదరాబాద్ మెట్రో కథ మళ్లీ మొదటికే.. SBI క్యాప్స్ చేతికి భవితవ్యం!
X

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. మొదటి దశను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి ఐడీబీఐ, డీఎంఆర్సీ ఇచ్చిన నివేదికలను కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టింది. మొదటి, రెండు దశ ప్రాజెక్టుల్లో కేంద్ర ప్రభుత్వం జాయింట్ వెంచర్‌గా ఉండాలంటే ఎస్‌బీఐ క్యాప్స్ ఇచ్చే నివేదిక ఆధారంగానే నిర్ణయం తీసుకుంటామని ప్రకటించడం గమనార్హం.

ఇప్పటికే రెండు నివేదికలు

మెట్రో స్వాధీనానికి కావాల్సిన ఫైనాన్స్, లీగల్, టెక్నికల్ అంచనాలకు సంబంధించి రెండు కన్సల్టెన్సీలను నియమించిన విషయం తెలిసిందే. టెక్నికల్ కన్సల్టెంట్‌గా ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ (డీఎంఆర్సీ), ఫైనాన్స్, లీగల్ అడ్వైజర్‌గా ఐడీబీఐని ప్రభుత్వం నియమించింది. ఫైనాన్స్, లీగల్ అంశాల్లో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చేయడానికి ఐడీబీఐ సంస్థ స్టడీ చేసింది. ఎల్అండ్‌టీ సంస్థకు ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన బకాయిలు, ఇతర అంశాలకు సంబంధించిన రిపోర్టు రూపొందించడం తో పాటు ప్రభుత్వానికి ఇప్పటికే అధికారులు అందజేశారు. దీని ఆధారంగానే హెచ్ఎంఆర్ఎల్, ఎల్అండ్ టీ సంస్థలు చర్చించుకుని ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నాయి.

వాల్యూయేషన్, విస్తరణపై నివేదిక

హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌- I వాల్యూయేష‌న్‌, స్వాధీనానికి అవ‌స‌ర‌మైన రుణ సేక‌ర‌ణ‌, రుణ సంస్థ ఎంపిక, మెట్రో ఫేజ్‌-II విస్తర‌ణ‌, నిర్మాణ‌ వ్యయం, అందుకు అవ‌స‌ర‌మైన రుణ సేక‌ర‌ణ తదితర అంశాల‌ను అధ్యయ‌నం చేసేందుకు క‌న్సల్టెంట్‌ను నియ‌మించాల‌ని కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి సమావేశంలో ఏకాభిప్రాయానికి వ‌చ్చిన విషయం తెలిసిందే. క‌న్సల్టెంట్‌గా ఎస్‌బీఐ క్యాప్స్ ని ఎంపిక చేశారు. మెట్రో ఫేజ్‌-I వాల్యూయేష‌న్‌, ఫేజ్‌-II విస్తర‌ణ‌తో పాటు ఇత‌ర అంశాల‌పై కన్సల్టెన్సీ స‌మ‌గ్రంగా అధ్యయ‌నం చేయ‌నుంది. ఆ సంస్థ ఇచ్చే నివేదిక ఆధారంగా భ‌విష్యత్ కార్యాచ‌ర‌ణ చేప‌ట్టనున్నారు.

రూ.13,600 కోట్ల రుణంతోనే..

హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణ కోసం తప్పనిసరిగా ఫేజ్ 1ను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వచ్చింది. ఇందుకుగాను రూ.15 వేల కోట్లు ఎల్అండ్‌టీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఇదే క్రమంలో రూ.13,600 కోట్ల రుణం కోసం అన్వేషణ ప్రారంభమైంది. అందులో భాగంగానే జపాన్ నుంచి రుణం మంజూరైందని.. అది ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్‌సీ) ద్వారా విడుదల కావాల్సి ఉందని ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. కానీ పరిస్థితి తారుమారైంది. రెండో దశ ప్రాజెక్టులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్‌గా చేపట్టాలని నిర్ణయించడం, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్(ఐర్ఎఫ్‌సీ) ద్వారా, జపాన్ నుంచి రుణం వంటి అంశాలపై స్పష్టత కరువైంది. మెట్రో ఫేజ్ 1 స్వాధీనానికి రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన రూ.13,600 కోట్ల అప్పు ఇప్పట్లోరాదని తేలిపోయింది. ఈ రుణం వస్తే తప్ప మొదటి దశ స్వాధీన ప్రక్రియ పూర్తయ్యే అవకాశముంది. కానీ దీనికి కేంద్ర ప్రభుత్వం కొర్రీ పెట్టింది.

రూ.1600 కోట్ల ఖర్చు..

మెట్రో ఫేజ్ 1 స్వాధీనాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైనా సరే అందుకు అవసరమైన రుణాన్ని పొందాలని అన్ని మార్గాలను అన్వేషించింది. అందులో భాగంగానే ఐఆర్ఎఫ్‌సీని ఆశ్రయించింది. చర్చలు, రుణ ప్రాసెసింగ్ ఫీజు కోసం కోట్లు ఖర్చు పెట్టారు. రుణాలను రీఫైనాన్స్ చేయడానికి ప్రభుత్వం ఐఆర్ఎఫ్‌సీతో రూ.13,600 కోట్ల రుణ ఒప్పందం కింద ప్రభుత్వం తన సొంత ఈక్విటీ వాటాగా రూ.1,461 కోట్లను ఎస్క్రో ఖాతాలో జమ చేసింది. దీంతో పాటు బ్రోకరేజ్ చేసిన సంస్థకు 4-6శాతం కమీషన్‌ను ప్రభుత్వం చెల్లించింది. ఇంత చేసినా రుణం రాలేదు. పైగా.. కేంద్రం చర్చల మీద చర్చలు జరిపి ఓ కన్సల్టెన్సీ నియమించి చేతులు దులుపుకున్నది.

మరో 6 నెలలు ఆగాల్సిందే..

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేసిందనే విమర్శలు లేకపోలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులను పలుమార్లు కలిసినా ఫలితంగా లేకుండా పోయింది. కన్సల్టెన్సీ పేరుతో కొత్త డ్రామాకు కేంద్రం తెరలేపింది. మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టులపై ఏడాది క్రితమే కన్సల్టెన్సీని నియమిస్తే ఇప్పటికే మొదటి దశ స్వాధీన ప్రక్రియతోపాటు రెండో దశ ప్రాజెక్టు పనులపై స్పష్టత వచ్చేదని పలువురు ఇంజినీరింగ్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశలు పెట్టుకున్న ఐఆర్ఎఫ్‌సీ లోన్ ఇక ఆగిపోయినట్టే.

మెట్రో ఫేజ్‌-I స్వాధీనం, ఫేజ్‌-II విస్తర‌ణ‌ ప్రక్రియ ఇక కొత్తగా ప్రారంభం కానున్నది. మెట్రో ఫేజ్ 1 ఆస్తుల అంచనా, రుణ ప్రక్రియ, రుణ సంస్థల ఎంపిక, స్వాధీన ప్రక్రియ, మెట్రో 2 విస్తరణ, నిర్మాణ వ్యయం, రుణ సేకరణ అంశాలపై కన్సల్టెన్సీ సంస్థ ఎస్బీఐ క్యాప్స్ అధ్యయ‌నం చేసి నివేదిక అందించనుంది. ఇందుకు కొంత సమయం పట్టనుంది. ఆ నివేదిక వచ్చిన తర్వాతే.. మెట్రో ఫేజ్ 1 స్వాధీనానికి రుణాలిచ్చే సంస్థను నిర్ణయిస్తారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరో ఆరు నెలలు పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక 2027లోనే హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై స్పష్టత వచ్చే అవకాశముంది.

ఎస్‌బీఐ క్యాప్స్..

ఎస్‌బీఐ క్యాప్స్ అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ. ప్రముఖ పెట్టుబడి బ్యాంకింగ్ విభాగం. ఇది ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్, మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్, ప్రైవేట్ ఈక్విటీ వంటి కార్పొరేట్ సేవలను అందిస్తుంది. అయితే గతంలో జీహెచ్ఎంసీ బాండ్ల ద్వారా నిధుల సేకరణలో ఈ సంస్థనే కన్సల్టెన్సీ గా పనిచేసింది.

Next Story