హుజురాబాద్‌ టీఆర్ఎస్‌లో కీలక మలుపు.. ఐదురోజుల్లో ప్రకటన!

by Disha Web Desk 19 |
హుజురాబాద్‌ టీఆర్ఎస్‌లో కీలక మలుపు.. ఐదురోజుల్లో ప్రకటన!
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: హుజురాబాద్‌లో అధికార టీఆర్ఎస్ పార్టీ రాజకీయాలో మరో మలుపు తిరిగాయి. నియోజకవర్గంలో కొంతమంది నాయకులు రెండు రోజులుగా ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కూడా వీరి ఎత్తులకు పైఎత్తు వేస్తూ ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన నాయకులు స్థానికంగా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకుని తమ ఆవేదనను వెల్లగక్కుతున్న క్రమంలోనే కౌశిక్ రెడ్డి నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్‌తో సమావేశం జరిపించారు. దీంతో కౌంటర్ పాలిటిక్స్ ఆరంభం అయ్యాయని చర్చ సాగుతున్న సమయంలోనే మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.

ఐదు రోజుల్లో ఇంఛార్జీ ప్రకటన..

మరో వైపున గురువారం రాత్రి సిద్దిపేటలో ఉన్న మంత్రి హరీష్ రావును కూడా ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డితో పాటు నాలుగు మండలాలకు చెందిన ప్రజా ప్రతినిధిలు కలిశారు. ఈ సందర్భంగా మంత్రితో జరిగిన చర్చల్లో నియోజకవర్గ ఇంఛార్జీ విషయం గురించి మాట్లాడినట్టు విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి ఐదు రోజుల్లో హుజురాబాద్‌లో టీఆర్ఎస్ ఇంఛార్జిని నియమిస్తామని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించినట్టు సమాచారం. దీంతో నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయాలకు పుల్ స్టాప్ పడే అవకాశాలు ఉన్నాయని పార్టీ నాయకులు అంటున్నారు.

షాకా.. బ్రేకా..

ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి పాలైన గెల్లు శ్రీనివాస్ భవితవ్యం ఏంటీ అన్నదే అంతుచిక్కకుండా తయారైంది. ఇప్పటి వరకు ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులే ఆయా నియోజకవర్గాల ఇంఛార్జీలుగా వ్యవహరిస్తున్నారు. అదే పద్దతి హుజురాబాద్‌లోనూ సాగుతోందని భావించారంతా. అయితే అనూహ్యంగా ఐదు రోజుల్లో పార్టీ ఇంఛార్జీని ప్రకటిస్తామని మంత్రి హరీష్ అనడంతో గెల్లు శ్రీనివాస్ భవితవ్యం ఏంటీ అన్న చర్చ మొదలైంది. అధిష్టానం ఆయన పేరునే ప్రకటిస్తుందా లేక మరొకరిని డిక్లేర్ చేస్తుందా అన్నదే మిస్టరీగా మారింది. రెండు రోజులుగా కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా సమావేశాలు జరుపుతున్న వారంతా కూడా గెల్లు శ్రీనివాస్‌కు కూడా తెలియకుండా నామినేటెడ్ పదవులను కేటాయిస్తున్నారన్న ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో గెల్లు శ్రీనివాస్ విషయంలో అధినేత కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది.



Next Story