హుజురాబాద్‌‌ టీఆర్ఎస్‌లో ముదిరిన వర్గపోరు!

by Disha Web Desk |
హుజురాబాద్‌‌ టీఆర్ఎస్‌లో ముదిరిన వర్గపోరు!
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: హుజురాబాద్ అధికార పార్టీలో వర్గపోరు రచ్చకెక్కిందా..? ఇద్దరు నాయకుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడిందా..? ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారా...? అంటే అవుననే స్పష్టం అవుతోంది. నిన్నమొన్నటి వరకు రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిన ఈ నియోజకవర్గంలో ఇప్పుడు టీఆర్ఎస్ అధిష్టానానికి సరికొత్త తలనొప్పి ప్రారంభం అయినట్టుగా ఉంది. ఇప్పటి వరకూ చాపకింద నీరులా ఉన్న హుజురాబాద్ వర్గపోరు ఒక్కసారిగా రచ్చకెక్కడం చర్చనీయాంశంగా మారింది.

రెండు రోజులుగా...

నియోజకవర్గంలోని హుజురాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక, కమలాపూర్ మండలాల్లోని సెకండ్ కేడర్ అసమ్మతి గళం వినిపించడం ఆరంభించింది. బుధ, గురువారాల్లో జరిగిన మండలాల వారిగా ద్వితీయ శ్రేణి నాయకులంతా సమావేశాలు ఏర్పాటు చేసుకుని పార్టీలో గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో మొదటి నుండి ఉన్న తమను కాదని ఉప ఎన్నికలు, ఆ తరువాత గులాభి కండువా కప్పుకున్న వారికి ప్రాధాన్యత కల్పించడంపై వీరు తమ నైరాశ్యాన్ని వెళ్లగక్కుతున్నారు. పార్టీ ఇంఛార్జిగా ఉన్న గెల్లు శ్రీనివాస్‌కు సంబంధం లేకుండా ఏక పక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి తీరును తప్పుబడుతున్నారు. ఆయన వెంట వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నాడని, మిగతా వారిని పట్టించుకోవడం లేదన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గురువారం వీణవంక మండలంలో జరిగిన సమావేశంలో కూడా ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. మంత్రులు కూడా కౌశిక్ రెడ్డి నిర్ణయాలనే అమలు చేస్తున్నారని, తమ అభిప్రాయాలను పట్టించుకోవడం లేదని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకోవాలని కోరుతోంది హుజురాబాద్ కేడర్.

అక్కడ ఆ వర్గం...

మరో వైపున కౌశిక్ రెడ్డి హైదరాబాద్ కేంద్రంగా మంత్రాంగం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. బుధవారం నియోజవకర్గంలో తనపై వ్యతిరేకంగా సమావేశాలు ఏర్పాటు చేశారన్న సమాచారం అందుకున్న కౌశిక్ రెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది. గురువారం నియోజకవర్గంలోని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను హైదరాబాద్ కు పిలిపించుకుని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ తో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి ప్రజా ప్రతినిధులు చర్చించారు. తనకు వ్యతిరేకంగా జట్టు కట్టారని తెలుసుకున్న కౌశిక్ రెడ్డి తనకు అనుకూలంగా నియోజకవర్గంలో కేడర్ ఉందన్న చెప్పకనే చెప్పేందుకే ప్రజా ప్రతినిధులను హైదరాబాద్ కు రప్పించుకుని బోయినపల్లి వినోద్ కుమార్ తో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయించారని అంటున్నారు హుజురాబాద్ నాయకులు.

ఆ కమిటీలతో ఆజ్యం

కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ అయిన తరువాత వేసిన రెండు కమిటీలతోనే వ్యతిరేకత బట్టబయలైంది. సమ్మక్క సారలక్క జాతర సందర్భంగా వీణవంక మండలం కేంద్రానికి చెందిన కమిటీని వేయించారు. అయితే చాలా కాలంగా తాము ఇక్కడ జాతర నిర్వహిస్తున్నామని ఉదయ నందన్ రెడ్డి హై కోర్టును ఆశ్రయించి తమ పూర్వీకుల నుండి ఇక్కడ జాతర నిర్వహిస్తున్నామని, సొంత ఖర్చులతోనే జాతర నిర్వహిస్తున్నామని కూడా కోర్టుకు నివేదించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ ప్రమేయం ఉండకుండా ఆదేశాలు ఇవ్వాలని హై కోర్టును అభ్యర్థించారు. ప్రైవేటు స్థలానికి సంబంధించిన విషయంలో జోక్యం చేసుకోకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది.

అలాగే తాజాగా అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంట రామాలయ కమిటీని కూడా వేసినట్టు ప్రచారం జరిగింది. కమిటీ ఛైర్మన్ తో పాలకవర్గ సభ్యుల గురించి కూడా వెలుగులోకి రావడంతో కౌశిక్ రెడ్డి వ్యవహరశైలిని తప్పు పడుతూ హుజురాబాద్ నియోజకవర్గ నాయకులు ముఖ్యనాయకులకు సమాచారం చేరవేశారు. పార్టీలో సీనియర్లను కాదని ఇటీవల చేరిన వారికి ఎలా నామినేటెడ్ పోస్టులు ఇస్తారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాగే వదిలేస్తే పరిస్థితి తమ చేయి దాటిపోయే ప్రమాదం ఉందని భావించిన హుజురాబాద్ నాయకులు ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి తమ ఆవేదనను వెళ్లగక్కడం ఆరంభించారు. గెల్లు శ్రీనివాస్‌కు అనుకూలంగా వీరంతా సమావేశాలు ఏర్పాటు చేస్తుండడం గమనార్హం. ఇందులో కౌశిక్ రెడ్డి సొంతమండలం వీణవంకకు చెందిన టీఆర్ఎస్ నాయకులు కూడా అసమ్మతి గళాన్ని ఎత్తుకోవడం గమనార్హం.



Next Story

Most Viewed