కర్నూలులో దారుణం.. ఆసుపత్రిలో అందరూ చూస్తుండగానే బాలింతను చంపిన భర్త

by Muthe.Rajitha |

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఒక భర్త తన భార్యను కత్తితో విచక్షణారహితంగా పొడిచి దారుణంగా హత్య చేశాడు.

కర్నూలులో దారుణం.. ఆసుపత్రిలో అందరూ చూస్తుండగానే బాలింతను చంపిన భర్త
X

దిశ, వెబ్ డెస్క్ : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో శనివారం రాత్రి ఒళ్లు గగుర్పొడిచే ఘోరం జరిగింది. ఆస్పత్రి ప్రాంగణంలోనే ఒక కిరాతక భర్త తన భార్యను కత్తితో విచక్షణారహితంగా పొడిచి దారుణంగా హత్య చేశాడు. ప్రసూతి వార్డు సమీపంలో అందరూ చూస్తుండగానే జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామన్న, నర్సమ్మ దంపతుల మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు ఉన్నట్లు తెలుస్తోంది. గొడవల కారణంగా వీరిద్దరూ గత నాలుగు నెలలుగా విడివిడిగా ఉంటున్నారు. అయితే, నర్సమ్మ ప్రసవం కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరగా.. ఆడపిల్లకు జన్మనిచ్చింది. కూతురును చూసే నెపంతో రామన్న శనివారం రాత్రి అక్కడికి వచ్చాడు. ఆ సమయంలో నర్సమ్మతో మళ్లీ పాత గొడవలు మొదలయ్యాయి. మద్యం మత్తులో ఉన్న రామన్న, తీవ్ర ఆవేశానికి లోనై తన వెంట తెచ్చుకున్న కత్తితో నర్సమ్మపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమె శరీరంపై పలుచోట్ల కత్తిపోట్లు పడటంతో తీవ్ర రక్తస్రావమై అక్కడే కుప్పకూలిపోయింది.

వైద్యం అందుతుండగానే మృతి

దాడి జరిగిన వెంటనే ఆస్పత్రి సిబ్బంది స్పందించి ఆమెకు అత్యవసర చికిత్స అందించినప్పటికీ, గాయాలు బలంగా ఉండటంతో నర్సమ్మ చికిత్స పొందుతూ మరణించింది. సమాచారం అందుకున్న ఎమ్మిగనూరు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు రామన్నను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు, హత్యకు గల కారణాలపై లోతైన విచారణ జరుపుతున్నారు. కుటుంబ కలహాలే ఈ హత్యకు దారి తీశాయని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో భద్రతా లోపాలు మరోసారి ఈ ఘటనతో చర్చకు దారితీశాయి.

Next Story