భార్య అలక.. భర్త ఆత్మహత్య

by Muthe.Rajitha |

భార్య అలిగిందనే కారణంగా ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం ఏపీలోని కడప జిల్లాలో కలకలం రేపింది.

భార్య అలక.. భర్త ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్ : భార్య అలిగిందనే కారణంగా ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం ఏపీలోని కడప జిల్లాలో కలకలం రేపింది. బాలాజీనగర్‌కు చెందిన వెంకటసుబ్బయ్య అనే వ్యక్తి క్షణికావేశంలో తీసుకున్న ఈ నిర్ణయం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసుల వివరాల ప్రకారం.. వెంకటసుబ్బయ్య, అనురాధ దంపతుల మధ్య గత కొంతకాలంగా చిన్నపాటి విషయాలకే మనస్పర్థలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం ఉదయం అనురాధ స్టవ్‌పై పాలు పెట్టగా, అవి పొంగిపోయాయి. దీనిని గమనించిన వెంకటసుబ్బయ్య తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. "నీకు ఎన్ని సార్లు చెప్పినా పద్ధతి మార్చుకోవా?" అంటూ భార్యపై కేకలు వేశారు. ఆవేశం పట్టలేక తన తలను గోడకేసి బలంగా కొట్టుకోవడంతో అతడికి చిన్నపాటి గాయమైంది. భర్త ఆగ్రహాన్ని చూసిన అనురాధ, అలిగి ఇంటి బయటకు వచ్చి కూర్చుంది.

అయితే, లోపల ఒంటరిగా ఉన్న వెంకటసుబ్బయ్య ఉద్వేగంతో ఫ్యాన్‌కు ఉరేసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత అనురాధ లోపలికి వెళ్లి చూడగా, భర్త ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడంతో ఆమె కేకలు వేశారు. స్థానికులు వెంటనే స్పందించి ఆయన్ని కిందకు దించినప్పటికీ, అప్పటికే వెంకటసుబ్బయ్య ప్రాణాలు కోల్పోయారు. మృతుడికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

Next Story