రాములమ్మ సైలెంట్! అస‌లు ఏమైంది

by velandi.Saikiran |   (  Updated:2026-06-28 22:30:55  IST  )

ఫైర్ బ్రాండ్ పొలిటిషియన్ గా పేరుపొంది రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన ప్రముఖ సినీనటి విజయశాంతి ప్రస్తుతం సైలెంట్

రాములమ్మ సైలెంట్! అస‌లు ఏమైంది
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఫైర్ బ్రాండ్ పొలిటిషియన్ గా పేరుపొంది రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన ప్రముఖ సినీనటి విజయశాంతి ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు. కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్సీ పదవీ తీసుకున్న తర్వాత పార్టీ కార్యక్రమాల్లో ఆమె యాక్టివ్ గా ఉండటం లేదన్న చర్చ వినిపిస్తున్నది. రాములమ్మగా సినీ ఇమేజ్ ను సొంతం చేసుకున్న విజయశాంతి రాజకీయాల్లో చేరిన తర్వాత మరింత పాపులారిటీ సంపాదించారు. విజయశాంతిని గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్‌, కన్వీనర్‌గా నియమించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గతేడాది ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. ఆ తర్వాత విజయశాంతి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారు. కానీ పార్టీ కార్యక్రమాల్లో అంతగా కనిపించడం లేదని పొలిటికల్ సర్కిల్ లో చర్చ నడిచింది. పలు కీలక సందర్భాల్లో ఆమె సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను పంచుకుంటారన్న టాక్ వస్తోంది. కాగా, ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాలోనూ కనిపించడం లేదు.

ఉద్యమకారుల కమిటీలో చోటు!

తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ఇటీవల జరిగిన శాసనమండలి సమావేశాల్లో విజయశాంతి మాట్లాడారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విజయశాంతి మండలిలో చేసిన ఈ ప్రసంగంపై ఇటు పార్టీ, అటు రాజకీయవర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. కాగా, ఉద్యమకారుల గుర్తింపునకు ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు చైర్మన్ గా ఐదుగురితో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించింది. అందులో విజయశాంతికి చోటు కల్పిస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. తెలంగాణ ఉద్యమంలో రాములమ్మ విస్తృతంగా పాల్గొన్నారని, ఎంపీగా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం లోక్ సభలో పోరాడిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆమెకు ఉన్న మాస్ ఇమేజ్ దృష్ట్యా పార్టీలో మరిన్ని బాధ్యతలు, పదవులను అప్పగిస్తే బాగుంటుందని పార్టీవర్గాలు పేర్కొంటున్నాయి. వచ్చే గ్రేటర్ పరిధిలోని మూడు కార్పొరేషన్ల ఎన్నికల్లో రాములమ్మకు కీలకమైన బాధ్యతలు ఇస్తే అర్బన్ ప్రాంతంలో పార్టీకి మైలేజ్ వస్తుందని నేతలు పేర్కొంటున్నారు.

Next Story