రష్యా నుంచి ఇరాన్ కు భారీగా డ్రోన్లు, ఔషధాలు!

by Muthe.Rajitha |

మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల వేళ.. ఇరాన్‌కు రష్యా డ్రోన్లు పంపుతున్నట్టు అంతర్జాతీయ మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి.

రష్యా నుంచి ఇరాన్ కు భారీగా డ్రోన్లు, ఔషధాలు!
X

దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ.. ఇరాన్‌కు రష్యా నుంచి భారీ ఆయుధాల సహాయం అందుతున్నట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రభుత్వం దశలవారీగా డ్రోన్లను ఇరాన్‌కు పంపిస్తున్నారని పాశ్చాత్య గూఢచార వర్గాల సమాచారం ఆధారంగా కథనాలు ప్రచురిస్తున్నాయి. ఈ నివేదికల ప్రకారం.. మార్చి నెల ప్రారంభం నుంచే రష్యా రహస్య రవాణా ప్రక్రియ మొదలైందని, ఈ నెలాఖరుకల్లా మొదటి విడత సరఫరా పూర్తయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. డ్రోన్లతో పాటు ఆహార పదార్థాలు, భారీగా ఔషధ సామగ్రి కూడా ఇరాన్‌కు పంపుతున్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది.

అయితే ఇరాన్ vs అమెరికా–ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న దాడుల్లో డ్రోన్లు కీలక ఆయుధాలుగా మారాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం వరకు దాడులు చేయగలగడంతో ఇటీవలి కాలంలోని యుద్ధాల్లో డ్రోన్ల వినియోగం ఎక్కువైంది. ఈ నేపథ్యంలో రష్యా నుంచి ఇరాన్‌కు డ్రోన్ల సరఫరా జరుగుతుందన్న వార్తలు అంతర్జాతీయ సమాజంలో ఆందోళన కలిగిస్తున్నాయి. అంతేకాదు రష్యా ఇరాన్‌కు కేవలం డ్రోన్లు మాత్రమే కాకుండా వాటి వినియోగానికి సంబంధించిన వ్యూహాత్మక సూచనలు కూడా అందిస్తోందని చెబుతున్నారు. ఇటీవలి సంవత్సరాల్లో రష్యా–ఇరాన్ మధ్య రక్షణ, వ్యూహాత్మక రంగాల్లో సహకారం పెరుగుతూ వస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం సమయంలో ఇరాన్ నుంచి డ్రోన్లు పొందిన రష్యా, ఇప్పుడు అదే విధంగా ఇరాన్‌కు సహాయం చేస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను రష్యా అధికారికంగా ఖండిస్తూ వస్తోంది. తాము యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసే చర్యలకు పాల్పడటం లేదని, తాము ఎలాంటి డ్రోన్లు, ఔషధాలు ఇరాన్ కు చేరవేయడం లేదని స్పష్టం చేసింది.

Next Story