మరో ఘోర ప్రమాదం.. బాణాసంచా యూనిట్‌లో భారీ పేలుడు.. ఇద్దరి మృతి!

by Malleboina Mahesh |

తేని జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడులో ఒకరు మరణించారు. ముగ్గురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మరో ఘోర ప్రమాదం.. బాణాసంచా యూనిట్‌లో భారీ పేలుడు.. ఇద్దరి మృతి!
X

దిశ, వెబ్ డెస్క్: వేసవి ఎండల కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న బాణసంచా ఫ్యాక్టరీల (Fireworks factories)లో భారీ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఈ ప్రమాదాల సంఖ్య అధికంగా కనిపిస్తుంది. తాజాగా తమిళనాడులోని తేని జిల్లా కంబమ్ పట్టణం కట్టుపల్లివాసల్ వీధిలో ఉన్న ఒక బాణాసంచా తయారీ కేంద్రంలో శనివారం ఉదయం భారీ పేలుడు (Huge explosion) సంభవించింది. 'లక్ష్మీ ఫైర్‌వర్క్స్' అనే లైసెన్స్ పొందిన ఈ యూనిట్‌లో ఉదయం 9:30 నుండి 10 గంటల సమయంలో కార్మికులు బాణాసంచా తయారీకి అవసరమైన రసాయనాలను కలుపుతుండగా (Chemical mixing) ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుతుంది. ఎన్నికల నేపథ్యంలో గత రెండు రోజులుగా మూసి ఉన్న ఈ యూనిట్‌ను ఈరోజే తిరిగి ప్రారంభించగా, ప్రారంభించిన కొద్దిసేపటికే ఈ ఘోరం జరగడం స్థానికంగా విషాదాన్ని నింపింది.

ఈ పేలుడు ధాటికి సూర్య (21), దినేష్ అలియాస్ దీనా (23) అనే ఇద్దరు యువ కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు గుర్తించారు. మృతులు ఇద్దరూ కంబమ్ పట్టణానికి చెందిన వారు. గాయపడిన వారిని వెంటనే తేని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సుమారు 30 నిమిషాల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై కంబమ్ నార్త్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రసాయనాల గదిని వేగంగా తెరవడం వల్లే ఘర్షణ ఏర్పడి పేలుడు సంభవించి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

Next Story