CM, MP, MLA ల జీతాల్లో భారీ కోత

by Muthe.Rajitha |

ఆర్థిక సంక్షోభంతో హిమాచల్ ప్రదేశ్ సీఎం సహా, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల జీతాల్లో భారీగా కోత విధించారు.

CM, MP, MLA ల జీతాల్లో భారీ కోత
X

దిశ, వెబ్ డెస్క్ : హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభం దృష్ట్యా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతున్న తరుణంలో, ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించుకోవడానికి అసెంబ్లీలో అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం, ముఖ్యమంత్రి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు ఉన్నతాధికారుల జీతాల్లో ఆరు నెలల పాటు భారీగా కోత విధించాలని సీఎం సుఖ్‌విందర్ సింగ్ సుఖు నిర్ణయించారు. అయితే ఇది తాత్కాలికమేనని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగైన తర్వాత ఈ మొత్తాన్ని చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

జీతాల కోత వివరాలు

ముఖ్యమంత్రి సుఖు తన జీతంలో 50% కోత విధించుకోగా, ఉప ముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రులు, స్పీకర్, డెప్యూటీ స్పీకర్లు 30% తక్కువ జీతాన్ని తీసుకోనున్నారు. ఎమ్మెల్యేల జీతాల్లో 20% కోత విధించగా, చీఫ్ సెక్రటరీ, డిజిపి వంటి అత్యున్నత స్థాయి అధికారుల జీతాల్లో 30% వాయిదా వేశారు. అయితే, సామాన్య ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరటనిస్తూ గ్రూప్ సి, డి కేటగిరీల సిబ్బందికి ఈ కోత నుంచి పూర్తి మినహాయింపునిచ్చారు. అలాగే, ఎమ్మెల్యేల స్థానిక అభివృద్ధి నిధులను (MLA LAD) కూడా సగానికి తగ్గించారు.

సంక్షోభానికి కారణాలివే..

హిమాచల్ ప్రదేశ్ ఈ స్థాయి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడానికి ప్రధానంగా కేంద్రం నుంచి రావాల్సిన రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ (RDG) నిలిచిపోవడమే కారణమని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. దీనివల్ల రాష్ట్రానికి ఏడాదికి సుమారు రూ. 8,000 కోట్ల మేర ఆదాయం తగ్గిపోయింది. రాష్ట్రం ఇప్పటికే భారీ రుణ భారంతో 'డెట్ ట్రాప్'లో చిక్కుకుందని సీఎం సుఖు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాదితో పోలిస్తే 2026-27 బడ్జెట్‌ను దాదాపు రూ. 3,586 కోట్లు తగ్గించినప్పటికీ, పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఈ కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పలేదని ప్రభుత్వం వెల్లడించింది. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వానికి కొంత ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని ఆశిస్తున్నారు.

Next Story