- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్ అమెరికా ట్రేడ్ డీల్.. తెలంగాణకు లాభం ఎంత?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై విధించిన టారిఫ్‌లను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తూ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై విధించిన టారిఫ్‌లను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తూ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. భారత్–అమెరికా మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ లో ఇరు దేశాలు పరస్పరం తమ వ్యాపారాలు పెంచుకోవడం కోసం కొన్ని నియమాలు సడలించడం, టాక్సులు తగ్గించడం, కంపెనీలకు ఎగుమతులు దిగుమతులు సులభతరం అయ్యేలా చర్యలు తీసుకోవడం అని అర్థం చేసుకోవాలి. ఈ డీల్ దేశ స్థాయిలో కుదిరినా, దాని ప్రభావం రాష్ట్రాలపై నేరుగా పడుతుంది. తెలంగాణకు కూడా ఇందులో లాభాలున్నాయి, అలాగే కొన్ని నష్టాలూ ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ, ఫార్మా, వ్యవసాయం, పరిశ్రమలపై ఈ డీల్ ప్రభావం ఎక్కువగా ఉండనుంది.
లాభాలు వీటికే
మొదట లాభాల విషయానికి వస్తే.. తెలంగాణకు అతిపెద్ద ప్లస్ పాయింట్ ఐటీ రంగం. హైదరాబాద్ ఇప్పటికే అమెరికా కంపెనీలకు అడ్డాగా ఉంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, డెలాయిట్ వంటి అమెరికన్ కంపెనీలు తెలంగాణలో పెద్ద ఎత్తున తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ట్రేడ్ డీల్ వల్ల ఐటీ సేవలపై ఆంక్షలు తగ్గితే, అమెరికా నుంచి మరిన్ని ప్రాజెక్టులు హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉంది. దాంతో కొత్త ఉద్యోగాలు పెరుగుతాయి. ఐటీ ఉద్యోగులకు జీతాలు, అవకాశాలు మెరుగవుతాయి. స్టార్టప్‌లకు కూడా అమెరికా పెట్టుబడులు వచ్చే ఛాన్స్ ఉంటుంది.
తెలంగాణలో ఫార్మాస్యూటికల్ రంగం కూడా చాలా కీలకమైంది. హైదరాబాద్‌ను "ఫార్మా హబ్" అంటారు. అమెరికా మార్కెట్‌కు ఎక్కువగా మందులు ఎగుమతి చేసే రాష్ట్రాల్లో తెలంగాణ ముందుంది. ట్రేడ్ డీల్ వల్ల ఔషధాలపై టారిఫ్‌లు (ఇంపోర్ట్ టాక్సులు) తగ్గితే, తెలంగాణ ఫార్మా కంపెనీలకు భారీ లాభం కలుగుతుంది. ఎగుమతులు పెరుగుతాయి, కంపెనీల ఆదాయం పెరుగుతుంది, కొత్త ఫ్యాక్టరీలు, ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా జెనరిక్ డ్రగ్స్ రంగానికి ఇది పెద్ద ఊపునిస్తుంది.
అలాగే వ్యవసాయ రంగంలో కూడా కొన్ని లాభాలు ఉన్నాయి. తెలంగాణ నుంచి బియ్యం, మిర్చి, పత్తి వంటి ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి చేసే అవకాశాలు పెరుగుతాయి. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. తెలంగాణలో అగ్రో ఆధారిత పరిశ్రమలు పెరిగే అవకాశముంది. పంటలకు మంచి ధరలు రావచ్చు.
నష్టాలు కూడా..
అయితే అమెరికాతో ట్రేడ్ వల్ల నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చిన్న పరిశ్రమలకు ప్రమాదం ఉంది. అమెరికా నుంచి వచ్చే చౌకైన ఉత్పత్తులు ముఖ్యంగా ఆహార పదార్థాలు, డైరీ ప్రొడక్ట్స్, ఆగ్రో మెషినరీ తెలంగాణ మార్కెట్ ను ముంచెత్తనున్నాయి. వీటివల్ల స్థానిక చిన్న పరిశ్రమలు, MSME యూనిట్లు నష్టపోవచ్చు. పెద్ద కంపెనీలతో పోటీ పడలేక కొన్ని స్మాల్ ఇండస్ట్రీస్ మూతపడే ప్రమాదం ఉంది.
వ్యవసాయ రంగంలో కూడా ఒక రిస్క్ ఉంది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే వ్యవసాయ ఉత్పత్తులు చాలా చౌకగా ఉంటాయి. అవి భారత మార్కెట్‌లోకి వస్తే, తెలంగాణ రైతులకు ధరలు పడిపోవచ్చు. ముఖ్యంగా పాలు, పప్పులు, ఆయిల్ సీడ్స్ రంగంలో రైతులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. రైతులు సరైన రక్షణ చర్యలు తీసుకోకపోతే, ఈ డీల్ రైతుల పాలిట శాపంగా మారనుంది.
టెకీ నిపుణులకు కూడా ఈ డీల్ అడ్డంకిగా మారనుంది. ట్రేడ్ డీల్‌లో భాగంగా అమెరికా H-1B వీసాలపై కఠిన నిబంధనలు కొనసాగించినా, "లోకల్ హైరింగ్"ను ప్రోత్సహిస్తే, తెలంగాణ ఐటీ ఉద్యోగులకు అమెరికాలో అవకాశాలు పడిపోనున్నాయి. అలాగే అమెరికా కంపెనీలు కొంత పనిని తిరిగి తమ దేశంలోనే చేయాలని నిర్ణయిస్తే, అవుట్‌సోర్సింగ్ కూడా కొంత తగ్గే అవకాశం ఉంది.
ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు
మొత్తంగా భారత్ - అమెరికా ట్రేడ్ డీల్ తెలంగాణకు భారీ లాభాలను తెచ్చిపెడుతూనే.. కొన్ని నష్టాలను కూడా కలిగించే అవకాశం ఉంది. ఐటీ, ఫార్మా, ఎగుమతుల రంగాలకు లాభదాయకంగా ఉన్నా.. కానీ చిన్న పరిశ్రమలు, రైతులు, లోకల్ వ్యాపారాలను కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోకపోతే నష్టాలు కూడా ఎదురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ట్రేడ్ డీల్‌ను తెలంగాణకు అనుకూలంగా మార్చుకోవాలంటే, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కలిసి స్పష్టమైన రక్షణ విధానాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది.






