- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్థిక ఇబ్బందులతో మధ్యలోనే ఆగిపోయిన ఇళ్ల నిర్మాణాలు
అసంపూర్ణ ఇళ్లకు ఇందిరమ్మ పథకం కింద ఆర్థిక సాయం అందించాలి.. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి లబ్ధిదారుల విజ్ఞప్తి!

దిశ, తలకొండపల్లి : తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. తొలి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు, రెండో విడతలో మరో 2,000 ఇళ్లు మంజూరు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.
ప్రతి గ్రామంలో 20 నుంచి 30 అసంపూర్ణ ఇళ్లు..
ప్రతి గ్రామంలో సుమారు 20 నుంచి 30 వరకు అసంపూర్ణ ఇళ్లు ఉన్నాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చాలామంది నిరుపేదలు ఇళ్ల నిర్మాణాన్ని మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది. అసంపూర్ణ ఇళ్ల యజమానులను కూడా ప్రభుత్వం గుర్తించి రెండో విడతలో ప్రత్యేకంగా ఆదుకోవాలని వారు కోరుతున్నారు. కొత్త ఇళ్లతో పాటు, ఎక్కడ నిర్మాణం ఆగిపోయిందో అక్కడి నుంచే బిల్లులు మంజూరు చేసే విధంగా ప్రత్యేక మార్గదర్శకాలు, కార్యాచరణ రూపొందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అసంపూర్తి ఇళ్లకు ప్రత్యేక కోటా లేదా ప్రత్యేక బిల్లుల విధానం అమలు చేస్తే వేలాది నిరుపేద కుటుంబాలు తమ సొంతింటి కలను నెరవేర్చుకునే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.
ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి..
ఈ అంశాన్ని స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, అసంపూర్తి ఇళ్లకు కూడా రెండో విడతలో న్యాయం జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాంత ముద్దుబిడ్డ కావడంతో ఈ ప్రాంతానికి మరికొన్ని ఎక్కువ ఇల్లు తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యేని కోరుతున్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత కొన్ని రోజుల క్రితం రాష్ట్రంలో అసంపూర్తిగా మిగిలిపోయిన ఇండ్లను కూడా గుర్తిస్తామని ప్రకటించిన నేటికీ కార్యరూపం దాల్చక పోవడంతో అసంపూర్తి ఇండ్ల లబ్ధిదారుల చూపులు ఎండమావులు గానే మిగిలిపోయాయి. ప్రభుత్వం ఈ అంశంపై సానుకూల నిర్ణయం తీసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక ఇబ్బందులతో నిలిచిపోయిన వేలాది ఇళ్ల నిర్మాణాలు పూర్తవడంతో పాటు, పేద కుటుంబాల సొంతింటి కల కూడా సాకారం అవుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.






