వరంగల్ భద్రకాళి ఆలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత

by Jakkula.Mamatha |

వరంగల్ నగరంలోని ప్రసిద్ధ భద్రకాళి దేవాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

వరంగల్ భద్రకాళి ఆలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత
X

దిశ, వరంగల్ బ్యూరో: వరంగల్ నగరంలోని ప్రసిద్ధ భద్రకాళి దేవాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఅర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు శుక్రవారం అక్కడికి తడి బట్టలతో ప్రమాణం చేసేందుకు రావడంతో ఆందోళన నెలకొంది. ఇరు పార్టీల నేతలు రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఇటీవల ప్లాట్ల వేలం పాటలో దాదాపు రూ. 50 కోట్ల మేర భారీ అవినీతి జరిగిందంటూ ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఆరోపణలు చేయడంతో కాంగ్రెస్ నేతలు తిప్పి కొట్టారు. ఈ ఆరోపణలు స్థానిక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఆరోపణలను నిరసిస్తూ, తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని నిరూపించుకునేందుకు కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి రంగంలోకి దిగారు. అందరి ముందు అమ్మవారి సన్నిధిలో తన నిజాయితీని నిరూపించుకోవడానికి ఆయన తడి బట్టలతో అమ్మవారి ముందు ప్రమాణం చేయడానికి నిశ్చయించుకుని రావడంతో ఉద్రిక్తత నెలకొంది.

వేలం అంతా పారదర్శకం: కూడా చైర్మన్ వెంకట్రామిరెడ్డి

బాలసముద్రం భూముల వేలం ప్రక్రియ అంతా చట్టబద్ధంగా, అత్యంత పారదర్శకంగా జరిగిందని కూడా చైర్మన్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి రూ. 100 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. "రాజకీయ ఉనికి కోసమే యాదవరెడ్డి భద్రకాళి ఆలయం వద్ద తడి బట్టల డ్రామాలకు తెరలేపారన్నారు. ఆధారాలు లేకుండా పవిత్రమైన గుడికి వెళ్లి తప్పుడు ప్రమాణాలు చేస్తే అమ్మవారి శాపానికి గురవుతున్నారని అన్నారు. నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే మీడియా ముందుకు గానీ, విచారణ సంస్థల ముందుకు గానీ తీసుకురావాలన్నారు. "ప్రభుత్వ ప్రతిష్టను, కూడా సంస్థ పరువుకు భంగం పరిచే విధంగా అవాస్తవాలు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని చైర్మన్ హెచ్చరించారు.​భూముల వేలం ప్రక్రియ చుట్టూ తిరుగుతున్న ఈ వివాదం ప్రస్తుతం అధికార కాంగ్రెస్ మరియు ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీల మధ్య తీవ్ర సవాళ్లు, ప్రతిసవాళ్లకు దారితీసింది. ఇరు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటుండడంతో వరంగల్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

Next Story