హైదరాబాద్ - విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్

by Muthe.Rajitha |

సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో తిరిగి పట్నం బాట పట్టారు నగరవాసులు.

హైదరాబాద్ - విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్
X

దిశ, వెబ్ డెస్క్ : సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో తిరిగి పట్నం బాట పట్టారు నగరవాసులు. సొంత ఊళ్ల నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న ప్రయాణికుల కారణంగా హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి(NH-65)పై భారీ రద్దీ నెలకొంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరి నెమ్మదిగా కదులుతున్నాయి. శనివారం సాయంత్రం నుంచి రద్దీ మరీ ఎక్కువైంది. ఏపీలోని ప్రధాన పట్టణాల నుంచి వాహనాల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతోపాటు చిట్యాల, పెద్దకాపర్తి ప్రాంతాల్లో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతుండటంతో రద్దీ మరింత ఎక్కువైంది.

పరిస్థితిని నియంత్రించేందుకు పోలీసులు వాహనాలను దారి మళ్లిస్తూ ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. గుంటూరు నుంచి వచ్చే వాహనాలను మిర్యాలగూడ–హాలియా–చింతపల్లి–మాల్ మార్గంలోకి, విజయవాడ నుంచి వచ్చే హెవీ వాహనాలను కోడాడ్–మాల్ మార్గంలోకి మళ్లిస్తున్నారు. చిట్యాల వద్ద ట్రాఫిక్ ఎక్కువైతే భువనగిరి, రామన్నపేట మార్గాన్ని ఉపయోగించాలంటున్నారు. పంతంగి టోల్ ప్లాజాలో అదనపు లేన్‌లు తెరిచి మొత్తం 11 బూత్‌ల ద్వారా వాహనాల రాకపోకలను వేగవంతం చేస్తుండగా.. డ్రోన్‌లు, సీసీటీవీలతో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

ఈ రద్దీ ఆదివారం అర్థరాత్రి వరకు కొనసాగే అవకాశం ఉండటంతో ప్రయాణికులు ముందుగా ట్రాఫిక్ అప్‌డేట్స్ చూసుకుని, అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.

Next Story