భారీ వర్షం.. తడిసి ముద్దయిన 5 వేలకు పైగా పుస్తకాలు

by Muthe.Rajitha |

బెంగుళూరులో భారీ వర్షం కురవడంతో 5 వేలకు పైగా పుస్తకాలు తడిసి ముద్దయ్యాయి.

భారీ వర్షం.. తడిసి ముద్దయిన 5 వేలకు పైగా పుస్తకాలు
X

దిశ, వెబ్ డెస్క్ : బెంగళూరు సిలికాన్ వ్యాలీలో కురిసిన అకాల భారీ వర్షం నగరంలో బీభత్సం సృష్టించింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, భారీగా చెట్లు విరిగిపడ్డాయి. శివాజీనగర్‌లోని బౌరింగ్ ఆసుపత్రి వద్ద వర్షం ధాటికి ఒక భారీ గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇక లాల్‌బాగ్ సమీపంలోని ప్రసిద్ధ పాత పుస్తకాల మార్కెట్ (Old Book Market) ఈ వర్షం ధాటికి అతలాకుతలమైంది. ఏప్రిల్ 24 సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన కుండపోత వర్షం కారణంగా రోడ్డు పక్కన ఉన్న వందలాది పుస్తక దుకాణాలు నీట మునిగాయి. స్థానిక దుకాణదారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వరద నీటి వల్ల సుమారు 5,000కు పైగా పుస్తకాలు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. చాలా మంది వ్యాపారులు రోడ్డు పక్కనే ఫుట్‌పాత్‌లపై పుస్తకాలను పేర్చి విక్రయిస్తుంటారు.

ఊహించని విధంగా వర్షం ఒక్కసారిగా విరుచుకుపడటంతో, పుస్తకాలు తడవకుండా కప్పిన టార్పాలిన్ కవర్లు కూడా ఆ వేగాన్ని తట్టుకోలేకపోయాయి. దీంతో అమూల్యమైన సాహిత్యం, అరుదైన నవలలు, పాఠ్యపుస్తకాలు మరియు పాత మ్యాగజైన్లు అన్నీ పనికిరాకుండా పోయాయి. ఈ ఘటనపై పుస్తకాల షాపుల యజమానులు, చిరు దుకాణ దారులు ఆవేదన వ్యక్తం చేశారు. "నెలల తరబడి ఎంతో తపనతో సేకరించిన పుస్తకాలన్నీ ఒక్క రోజులోనే కళ్లముందే పాడైపోయాయి" అని పలువురు దుకాణదారులు కన్నీరుమున్నీరవుతున్నారు. చాలా మందికి ఇదే ఏకైక జీవనాధారం కావడంతో, ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పుస్తకాల మార్కెట్‌లో ఇంతటి నష్టం వాటిల్లినప్పటికీ, ఇప్పటివరకు బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ (BBMP) అధికారుల నుంచి ఎటువంటి స్పందన రాలేదని బాధితులు వాపోతున్నారు. నష్టపోయిన తమను ప్రభుత్వం మరియు మున్సిపల్ అధికారులు ఆదుకోవాలని, తమకు ఆర్థికంగా తోడ్పాటు అందించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. పుస్తక ప్రేమికులు సైతం ఈ వార్త విని విచారం వ్యక్తం చేస్తున్నారు. తమకు తోచిన విధంగా సహాయం చేస్తామని ముందుకు వస్తున్నారు.

Next Story