కాసేపట్లో నల్లమల సాగర్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. ధర్మాసనం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-12 08:29:29  IST  )

ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న పోలవరం-నల్లమల సాగర్ (Polavaram - Nallamala Sagar) లింక్ ప్రాజెక్టు‌పై తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం రోజురోజుకూ ముదరి పాకాన పడుతోంది.

కాసేపట్లో నల్లమల సాగర్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. ధర్మాసనం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న పోలవరం-నల్లమల సాగర్ (Polavaram - Nallamala Sagar) లింక్ ప్రాజెక్టు‌పై తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం రోజురోజకూ ముదరి పాకాన పడుతోంది. ఈ క్రమంలోనే ఆ ప్రాజెక్టును అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీం కోర్టు (Supreme Court) ధర్మాసనం విచారణ చేపట్టనుంది. అయితే, ఏపీ ప్రభుత్వ ప్రతిపాదించిన నల్లమల్ల సాగర్‌పై తెలంగాణ సర్కార్ కోర్టులో అభ్యంతరాలు తేవనెత్తనుంది. ఈ మేరకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేరుగా విచారణకు హాజరయ్యేందుకు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. ఈ ప్రాజెక్టు గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ (GWDT) అవార్డుకు విరుద్ధమని తెలంగాణ వాదించనున్నారు. అనుమతులు లేకుండా చేపడుతున్న పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు వల్ల గోదావరి బేసిన్‌లో తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటా తగ్గిపోతుందని తెలంగాణ తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ (Abhishek Manu Singhvi) వాదనలు వినిపించనున్నారు. సదరు ప్రాజెక్టుపై ఇప్పటికే 251 పేజీల రిట్ పిటిషన్‌ను సుప్రీంలో దాఖలు చేసిన తెలంగాన సర్కార్, పనులపై తక్షణమే స్టే ఇవ్వాలని కోరనుంది.

న్యాయ నిపుణులతో నిమ్మల భేటీ..

మరోవైపు, పోలవరం - నల్లమల సాగర్‌ లింక్ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వాదనను బలంగా వినిపించేందుకు సన్నద్ధమవుతోంది. సముద్రంలోకి వృథాగా పోయే గోదావరి నీటిని వాడుకుని, రాయలసీమ వంటి కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేయడమే తమ లక్ష్యమని ఏపీ వాదిస్తోంది. సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదివారం న్యాయ నిపుణులు, ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ద్వారా బలమైన వాదనలు వినిపించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

మధ్యవర్తిత్వమే మంచిది.. సుప్రీం ధర్మాసనం

కాగా, గత విచారణలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. జల వివాదాలను పరిష్కరించుకునేందుకు రెండు రాష్ట్రాలు మధ్యవర్తిత్వం (Mediation) ద్వారా ప్రయత్నిస్తే బాగుంటుందని సూచించింది. అయినప్పటికీ, తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం న్యాయపోరాటానికే మొగ్గు చూపుతున్నట్లు ఇరు రాష్ట్రాల చర్యలు కనిపిస్తున్నాయి. నేడు జరగబోయే విచారణలో కోర్టు ఏవైనా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తుందా.. లేదా స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తుందా అనేది వేచిచూడాల్సిందే మరి.

Read More... BIG BREAKING: పోలవరం - నల్లమల సాగర్‌పై సుప్రీం కీలక తీర్పు.. తెలంగాణ పిటిషన్ విత్ డ్రా

Next Story