Slow Living: వారంలో ఒక రోజు ఫోన్ వాడకపోతే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

by Malleboina Mahesh |

నేటి సమాజంలో డిజిటల్ శబ్దం నుండి బయటపడి, ప్రశాంతతను వెతుక్కునే క్రమంలో 'స్లో లివింగ్' (Slow Living) ప్రయాణం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం దేశంలోని ప్రతి నగరంలోని ఉద్యోగులు, యువకులు ఈ స్లో లివింగ్ ట్రెండ్ కు అలవాటు పడుతున్నారు.

Slow Living: వారంలో ఒక రోజు ఫోన్ వాడకపోతే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
X

దిశ, వెబ్ డెస్క్: టెక్నాలజీ యుగంలో ఉన్న ప్రతి మానవుడికి ఫోన్ అనేది ఒక వ్యసనంలా మారిపోయింది. ఉద్యోగ అవసరాలతో కొందరు ఫోన్‌ను నిత్యం వాడాల్సి వస్తుండగా.. సోషల్ మీడియా, గేమ్స్, సినిమాలు, వెబ్ సిరీస్‌లకు అలవాటు పడినవారు సెల్ ఫోన్లకు బానిసలుగా మారుతున్నారు. దీంతో వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడటంతో పాటు అనేక సమస్యలను సెల్ ఫోన్ తెచ్చిపెడుతుంది. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజలు ఉదయం కళ్లు తెరిచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు ఫోన్‌ను వదలడం లేదు. ఈ డిజిటల్ శబ్దం నుండి బయటపడి, ప్రశాంతతను వెతుక్కునే క్రమంలో 'స్లో లివింగ్' (Slow Living) ప్రయాణం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం దేశంలోని ప్రతి నగరంలోని ఉద్యోగులు, యువకులు ఈ స్లో లివింగ్ ట్రెండ్ (Slow Living Trend) కు అలవాటు పడుతున్నారు. ఇంతకి ఈ స్లో లివింగ్ ఏమిటి..? దీని వల్ల ఉపయోగాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

ట్రెండింగ్‌లో స్లో లివింగ్ ఉద్యమం?

సెల్ ఫోన్ లేకుండా బ్రతకలేని ఈ కాలంలో స్లో లివింగ్ ట్రెండ్ (Slow Living Trend) ప్రారంభమైంది. ఈ స్లో లివింగ్ అంటే పని మానేసి ఖాళీగా ఉండటం కాదు. ప్రతి పనిని ఆస్వాదిస్తూ, నిదానంగా, ఏకాగ్రతతో చేయడం. ముఖ్యంగా వీకెండ్స్‌లో ఫోన్‌లకు, ఇంటర్నెట్‌కు దూరంగా ఉండటం (Digital Detox) ఈ జీవనశైలిలో ప్రధాన భాగం. జపాన్ వంటి దేశాల్లో ప్రాచుర్యం పొందిన 'ఫారెస్ట్ బాతింగ్' (Forest Bathing) అంటే అడవిలో, ప్రకృతి ఒడిలో మౌనంగా గడపడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక ట్రెండ్‌గా మారింది.

వారంలో ఒక్కరోజు ఫోన్‌కు దూరంగా ఉంటే

నిత్యం సెల్ ఫోన్ వాడుతూ దానికి బానిసగా మారుతున్న ప్రజలు.. వారంలో కనీసం ఒక్క రోజైనా స్మార్ట్‌ఫోన్‌ను పక్కన పెట్టడం వల్ల మన శరీరంలో, మనసులో అద్భుతమైన మార్పులు సంభవిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. నిరంతర సమాచార భారంతో అలసిపోయిన మెదడుకు డిజిటల్ డిటాక్స్ ఒక రీసెట్ బటన్ లాగా పనిచేస్తుంది. ఇది మీ సృజనాత్మకతను (Creativity) పెంచుతుంది. అలాగే ఫోన్ వైపు చూడాలనే కోరికను నియంత్రించుకోవడం వల్ల మీ ఏకాగ్రత సామర్థ్యం పెరుగుతుంది. స్క్రీన్ నుండి వచ్చే బ్లూ లైట్ మన నిద్రను నియంత్రించే మెలటోనిన్ హార్మోన్‌ను దెబ్బతీస్తుంది. దీంతో ఫోన్ కు దూరంగా ఉండటం, డిటాక్స్ వల్ల గాఢ నిద్ర పడుతుంది. ఫోన్ స్క్రీన్‌లలో తలలు దూర్చకుండా కుటుంబ సభ్యులతో నేరుగా మాట్లాడటం వల్ల సంబంధాలు మెరుగుపడతాయి.

ప్రకృతి ఒడిలో కొత్త అనుభూతులు

డిజిటల్ డిటాక్స్ సమయంలో కేవలం ఖాళీగా ఉండకుండా, పాత కాలపు చేతివృత్తులు నేర్చుకోవడం, తోటపని చేయడం, వంట చేయడం వంటి పనులపై దృష్టి సారించడం మంచిది. మట్టితో పని చేయడం, మొక్కలను సంరక్షించడం వల్ల మనలో 'డోపమైన్' వంటి సంతోషాన్నిచ్చే హార్మోన్లు విడుదలవుతాయి. దీంతో దేశంలోని ఎంతో మంది యువత ప్రస్తుతం ఈ ట్రెండ్ ను ప్రతి ఆదివారం ఫాలో అవుతున్నారు. పెరుగుతున్న టెక్నాలజీ మన జీవితాన్ని సులభతరం చేయాలి కానీ, అది మనల్ని శాసించకూడదు. సోషల్ మీడియాలో ఇతరుల జీవితాలను చూస్తూ గడిపే గంటల సమయాన్ని, మీ స్వంత ఎదుగుదలకు కేటాయించండి. వారంలో ఒక రోజు 'డిజిటల్ ఫాస్టింగ్' (Digital Fasting) చేసి చూడండి. మీలో మీరే ఎంతో ప్రశాంతను కలిగిని అనుబూతిని అనుభవిస్తారని విశ్లేషకులు చెబుతున్నారు.

Next Story