బీఆర్ఎస్ గద్దెల జోలికొస్తే నీ గద్దె కూలుతుంది: హరీశ్‌రావు

by Gantepaka Srikanth |

సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత హరీశ్ రావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

బీఆర్ఎస్ గద్దెల జోలికొస్తే నీ గద్దె కూలుతుంది: హరీశ్‌రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘బీఆర్ఎస్ జెండా గద్దెల జోలికి వస్తే నీ గద్దె కూలుతుంది జాగ్రత్త. దుమ్ముదుమ్ము అయిపోతావు రేవంత్‌రెడ్డి. నువ్వు కూలిస్తే కూలిపోవడానికి బీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెల్లో లేదు, ప్రజల గుండెల్లో ఉన్నది. తెలంగాణ ప్రజల గుండెల్లో నుంచి పుట్టిన పార్టీ బీఆర్ఎస్. హౌలా మాటలు బంద్ చేయి.. ఆరు గ్యారెంటీల మీద దృష్టి పెట్టు’ అని మాజీమంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు హెచ్చరించారు. సోమవారం హరీశ్‌రావు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కేబినెట్‌లో కనీసం రైతు బంధుపై, ఎరువుల కొరతపై చర్చ లేదని.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపైనా చర్చించలేదని అన్నారు. రాజీవ్‌గాంధీ అప్పటి ముఖ్యమంత్రి అంజయ్యను అవమానిస్తేనే తెలుగు దేశం పార్టీ పుట్టిందని తెలిపారు. ఎన్టీఆర్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నేషనల్ ఫ్రంట్ పెట్టారని.. టీడీపీ పుట్టుకనే కాంగ్రెస్‌కు వ్యతిరేకమని.. కాంగ్రెస్ భూస్థాపితమే తన లక్ష్యమని ఎన్టీఆర్ ప్రతిన బూనారని అన్నారు. రేవంత్‌కు అంత ప్రేమ ఉంటే టీడీపీలోనే ఉండాల్సిందని.. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ద్రోహం చేశావని అన్నారు. కాంగ్రెస్ బూస్థాపితం అయితేనే ఎన్టీఆర్ ఆత్మకు శాంతి చేకూరుతుందన్నారు. కాంగ్రెస్ దేశం మొత్తం బీజేపీకి వ్యతిరేకంగా పోరాడితే.. రేవంత్ మాత్రం బీజేపీ, చంద్రబాబుతో కలిసి ఉంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఔట్ సోర్సింగ్ సీఎం, అసలైన కాంగ్రెస్ లీడర్ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొందని తెలిపారు.

కమీషన్ల కోసం కాంగ్రెస్ కొత్త విధానం..

సింగరేణి టెండర్ల కుంభకోణం, సీఎం, మంత్రుల వాటాల పంచాయితీలు చూస్తున్నామని హరీశ్‌రావు అన్నారు. కాంట్రాక్టు సైట్ విజిట్ పద్ధతి నైనీ బ్లాక్‌లో పెట్టారని.. అందువల్ల నైనీ బ్లాక్ టెండర్లు రద్దు చేస్తున్నామని భట్టి అన్నారని.. అసలు కాంట్రాక్టు సైట్ విజిట్ పద్ధతి రాష్ట్రంలో, దేశంలో లేదని స్పష్టం చేశారు. రేవంత్ ప్రభుత్వం వచ్చాక 2024లో సైట్ విజిట్ విధానం తెచ్చారని.. ఈ విధానం వచ్చాక మొదటి లబ్ధిదారు రేవంత్ బామ్మర్ది సుజన్ రెడ్డే అని ఆరోపించారు. ఈ విధానం వచ్చాక సింగరేణిలో ఆరు టెండర్లు కూడా ప్లస్ 7 పర్సంటేజ్‌కు టెండర్లు వారి అనుయాయులకు కట్టబెట్టడం జరిగిందన్నారు. ఎనీ ఓబీ కోల్ బ్లాక్ టెండర్ దేశంలో ఎక్కడ జరిగినా మైనస్ 10 నుంచి మైనస్ 22 శాతానికి పోతుందని.. రేవంత్ వచ్చాక కొత్త విధానం తెచ్చాక అన్ని టెండర్లు ప్లస్ 7 నుంచి ప్లస్ 10 శాతానికి పోతున్నాయని తెలిపారు. గతంలో వెంకటేషన్ కని అనే టెండర్ బీఆర్ఎస్ హయాంలో మైనస్ 7 ఉంటే, ఇప్పుడు ప్లస్ 7 మీద రీ టెండర్ చేసి కట్టబెట్టారని.. ఎస్ఆర్‌పీఎసీ టూ శ్రీరాంపూర్ అనే మైనస్ 7 టెండర్ రద్దు చేసి, ప్లస్ 7లో అప్పగించారని ఆరోపించారు. భట్టి కేవలం నైనీ టెండర్లు మాత్రమే రద్దు చేస్తామని చెప్పారని.. మిగతా వాటి సంగతి ఏమిటని ప్రశ్నించారు. అన్ని టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆన్‌లైన్ టెండర్ల ద్వారా దేశంలో ఎవరైనా వేయొచ్చని.. కానీ, సైట్ విజిట్ విధానంలో ముందే వెళ్లి సైట్ విజిట్ చేసి సింగరేణి నుంచి సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ విధానంలో ఎవరు టెండర్ వేస్తున్నారో ముందుగానే తెలుసుకొని, బెదిరించి, భయపెట్టి వారికి టెండర్ దక్కకుండా చేసి తమ అనుయాయులకు ప్లస్ 7 నుంచి ప్లస్ 20 శాతానికి కట్టబెట్టి, కమీషన్లు కొల్లగొట్టారని పేర్కొన్నారు. నైనీ బ్లాక్‌లోనూ ఇదే జరిగిందని.. వాటాల పంచాయితీ వచ్చి కొట్టుకునే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. సింగరేణి గతంలో బల్క్‌లో ఐఓసీఎల్ నుంచి సరఫరా చేసేవారని.. కానీ పర్సెంటేజీల కోసం డీజిల్‌ను కూడా కాంట్రాక్టర్లకు అప్పగించారని.. కమీషన్ల కోసం సింగరేణి ఇచ్చే డీజిల్ విధానం రద్దు చేశారని.. దీనివల్ల సింగరేణికి ఎక్కువ నష్టమని తెలిపారు. ఇదంతా సీఎం దగ్గరి సన్నిహితులు, సమీప బంధువు కనుసన్నల్లోనే జరుగుతున్నదని ఆరోపించారు.

వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలి..

చీటికి మాటికి సిట్ అంటున్నారని.. నిజాయితీ, దమ్ముంటే సీబీఐ విచారణకు అనుమతించాలని హరీశ్‌రావు సవాల్ విసిరారు. అన్ని వివరాలు అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. రేవంత్‌రెడ్డి, బీజేపీ మధ్య అక్రమ సంబంధం లేకుంటే, చీకటి ఒప్పందం లేకుంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని కిషన్‌రెడ్డిని డిమాండ్ చేశారు. రెండేళ్లుగా సింగరేణికి రెగ్యులర్ సీఎండీ లేరని.. ఇన్‌చార్జిని పెట్టి అడ్డగోలు వ్యవహారాలు చేస్తున్నారని ఆరోపించారు. సింగిరేణికి సీనియర్ అర్హత కలిగిన సీఎండీని పెట్టాలని డిమాండ్ చేశారు. కేబినెట్ దండుపాళ్యం ముఠా అంటే తన మీద పడ్డారని.. సింగరేణి టెండర్ల విషయంలో సీఎం, భట్టి, కోమటిరెడ్డి మధ్య వాటాల పంచాయితీ నిజం కాదా అని నిలదీశారు. మధ్యలో ఐఏఎస్, జర్నలిస్టులు బలి పశువులు అయ్యారని పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీలు అటకెక్కాయని.. వాటాలా పంచాయితీలు ముందుకు వచ్చాయని అన్నారు. కాంగ్రెస్ నాయకుడు సంపత్‌కుమార్ రూ.8 కోట్ల కోసం కాంట్రాక్టర్‌నే బెదిరించారని.. కాంట్రాక్టరే స్వయంగా పోలీసు డిపార్ట్మెంట్‌కు కంప్లైంట్ ఇచ్చారని తెలిపారు. ‌బీఆర్ఎస్‌ను, జర్నలిస్టులను వేధించడానికి సిట్లు వేస్తున్నారని.. డీజీపీ శివధర్‌రెడ్డి కాకి బుక్కు కాకి ఎత్తుకుపోయిందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సజ్జనార్‌కు ఇవన్నీ కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ బొగ్గు స్కాంపై న్యాయస్థానాలకు సైతం వెళ్లి కొట్లాడుతామని స్పష్టం చేశారు.

Next Story