- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రి కోమటిరెడ్డిపై జాలి చూపించిన హరీష్ రావు
తెలంగాణలో ఇప్పుడు థియేటర్ల కంటే సచివాలయంలోనే పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తున్నదని మాజీమంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ‘ఎక్స్’లో ఆరోపించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ఇప్పుడు థియేటర్ల కంటే సచివాలయంలోనే పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తున్నదని మాజీమంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ‘ఎక్స్’లో ఆరోపించారు. ఒకవైపు టికెట్ ధరలు పెంచుతూ జీవో బయటికి వస్తున్నదని.. మరోవైపు.. ఆ శాఖకు బాధ్యత వహించాల్సిన సినిమాటోగ్రఫీ మంత్రి తనకు తెలియదు.. తన ప్రమేయం లేదు.. తన దగ్గరికి ఫైల్ రాలేదని నిస్సహాయంగా చేతులెత్తేస్తారని పేర్కొన్నారు. శాఖ ఒకరిది.. పెత్తనం మరొకరిది.. జీవో ఇచ్చేది ఇంకొకరు.. అన్నట్లుగా పరిస్థితి మారిందని తెలిపారు. సాక్షాత్తు కేబినెట్ మంత్రికి తెలియకుండానే ఆయన శాఖలో ఇంత పెద్ద నిర్ణయం జరుగుతుంటే అసలు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరు అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి నడుపుతున్నది సర్కారా.. లేక సర్కస్ కంపెనీనా అని నిలదీశారు. టికెట్ల ధరల పెంపు విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసినా.. ఈ ప్రభుత్వ తీరు మారకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. ఒకవైపు అసెంబ్లీ సాక్షిగా సొంత డబ్బా.. మరొక వైపు క్షేత్రస్థాయిలో అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. తాను ఈ సీట్లో ఉన్నంత కాలం సినిమా టికెట్ రేట్ల పెంపు ఉండదని సీఎం రేవంత్‌రెడ్డి ప్రగల్బాలు పలికారని.. బెనిఫిట్ షోలు ఉండవని.. ఎవరికీ స్పెషల్ ప్రివిలేజ్ ఇవ్వబోమని మైకు పట్టుకొని ఊదరగొట్టారని పేర్కొన్నారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిస్థితి చూస్తే జాలేస్తున్నది
మరి ఇప్పుడు రాత్రికి రాత్రే జీవోలు ఎట్లా వచ్చినయ్ అని ప్రశ్నించారు. ఇప్పటికే మూడు సినిమాలకు అడ్డగోలుగా రేట్లు పెంచుతూ జీవోలు ఇచ్చారని.. మరో సినిమాకు కూడా జీవో ఇవ్వడానికి సిద్ధమయ్యారని ఆరోపించారు. అసెంబ్లీలో అబద్ధాలు ఆడటం రేవంత్‌కు వెన్నతో పెట్టిన విద్య అని తమకు తెలుసని.. కానీ సినిమా టికెట్ల విషయంలో కూడా ఇంత నిస్సిగ్గుగా సభను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తారా అని నిలదీశారు. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిస్థితి చూస్తే జాలేస్తున్నదని పేర్కొన్నారు. సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండానే జీవోలు విడుదల అవుతున్నాయంటే ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరని ప్రశ్నించారు. తెర వెనుక ఏ రాజ్యాంగేతర శక్తి ఉన్నదని.. ఒక సినిమా రిలీజ్ సమయంలో దుర్ఘటన జరిగినప్పుడు నీతులు చెప్పారు.. ఇప్పుడేమో యథేచ్ఛగా రేట్లు పెంచుతున్నారని పేర్కొన్నారు. సినిమా రంగాన్ని ఒక పరిశ్రమగా చూస్తున్నారా? లేక రాజకీయ కక్షలు తీర్చుకునే అడ్డాగా మార్చుకున్నారా? అని నిలదీశారు. ఒక సినిమాకేమో అర్ధరాత్రి దాకా పర్మిషన్ ఇవ్వరు.. ఇంకో సినిమాకేమో రెండు రోజుల ముందే రాచమర్యాదలతో పర్మిషన్ ఎలా ఇస్తారని నిలదీశారు.
వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే
వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అన్నందుకు ఒక హీరో సినిమాపై కక్ష గట్టారని.. సీఎం పేరు మర్చిపోయినందుకు ఇంకో హీరోని జైలుకు పంపించారని ఆరోపించారు. పదేళ్లు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు సినిమా పరిశ్రమను కంటికి రెప్పలా కాపాడుకున్నామని.. ఎక్కడా వివక్ష చూపలేదని తెలిపారు. అందుకే ఇవాళ తెలుగు సినిమా ఆస్కార్ స్థాయికి ఎదిగిందని పేర్కొన్నారు. అహంకారంతో, పిచ్చి చేష్టలతో, పగ ప్రతీకారాలతో, చిల్లర రాజకీయాలతో పరిశ్రమను నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా వాళ్లను కూడా రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఇది ప్రజా పాలన కాదని.. పాపిష్టి పాలనకు పరాకాష్ట అని ఫైర్ అయ్యారు. మొన్న ఎన్నికల్లో ఓడిపోయి.. నేడు రాజ్యాంగేతర శక్తిగా ఎదిగి సినిమా టికెట్ల రేట్లను శాసిస్తున్న ఆ కనిపించని శక్తి ఎవరో? ఒక్కో సినిమాకు కమీషన్ల రూపంలో ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నారో? ఆ వివరాలన్నీ త్వరలోనే బయటపెడతామని హెచ్చరించారు. ఆ శాఖ మంత్రికి తెలియకుండా జరుగుతున్న ఈ సినిమా రేట్ల కమీషన్ల దందాపై గవర్నర్ దృష్టి సారించాలని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.






