- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఊపిరి బిగబట్టే ఉత్కంఠకు హ్యాపీ ఎండ్.. బోర్‌వెల్ నుండి సురక్షితంగా నాలుగేళ్ల చిన్నారి
పంజాబ్‌లో బోర్‌వెల్‌లో పడ్డ 4 ఏళ్ల గుర్కరన్‌ను ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు 9 గంటల పాటు శ్రమించి సురక్షితంగా రక్షించాయి. చిన్నారి ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉంది.

దిశ, వెబ్ డెస్క్: బోర్‌వెల్‌లో పడిపోయిన నాలుగేళ్ల బాలుడి ఉదంతం సుఖాంతమైంది. పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం చక్ సమాన గ్రామంలో గుర్కరన్ సింగ్ (Gurkaran Singh) అనే చిన్నారి తన ఇంటి సమీపంలో ఆడుకుంటూ, కొత్తగా తవ్విన బోర్‌వెల్ (Borewell)లో ప్రమాదవశాత్తూ పడిపోయాడు. బాలుడు బోర్‌వెల్ పైపునకు, పక్కనే ఉన్న మట్టి గోడకు మధ్య ఉన్న సందులో దాదాపు 25 నుండి 30 అడుగుల లోతులో చిక్కుకుపోయాడు. ఈ సమాచారం అందిన వెంటనే జిల్లా యంత్రాంగం, పంజాబ్ పోలీస్, ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF), ఎస్డీఆర్‌ఎఫ్ (SDRF) బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని యుద్ధప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి.
లోపల మట్టి విరిగి పడుతుండటం, కొద్దిగా నీరు చేరడంతో రెస్క్యూ ఆపరేషన్ (Rescue operation) అత్యంత సవాలుగా మారింది. అధికారులు జేసీబీ యంత్రాల సహాయంతో బోర్‌వెల్‌కు సమాంతరంగా లోతైన గుంతను తవ్వి, చిన్నారికి పైపుల ద్వారా నిరంతరం ఆక్సిజన్‌ను అందించారు. సుమారు 9 గంటల పాటు ఊపిరి బిగబట్టే ఉత్కంఠ నడుమ సాగిన ఈ పోరాటం తర్వాత శనివారం తెల్లవారుజామున 12:40 గంటల సమయంలో రెస్క్యూ సిబ్బంది గుర్కరన్‌ను సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం చిన్నారిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.






