కన్‌స్ట్రక్షన్ బారికేడ్లతో సగం హైవే క్లోజ్.. నాలుగేళ్లుగా పట్టించుకోని ఎంఎంసీ, హైడ్రా

by Malleboina Mahesh |

నాగోల్ సర్కిల్‌లో అధికార పార్టీ మాజీ ఎమ్మెల్సీ ఒకరు ప్రధాన రేడియల్ రోడ్డును ఆక్రమించి బారికేడ్లు వేశారు. ఎంఎంసీ, హైడ్రా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 🚧🛣️ దౌర్జన్యం

కన్‌స్ట్రక్షన్ బారికేడ్లతో సగం హైవే క్లోజ్.. నాలుగేళ్లుగా పట్టించుకోని ఎంఎంసీ, హైడ్రా
X

దిశ, వనస్థలిపురం : కబ్జాకు కాదేది అనర్హం అన్నట్లుగా.. మల్కాజ్​గిరి మున్సిపల్​ కార్పొరేషన్​ఎల్బీనగర్​జోన్ పరిధిలోని నాగోల్​సర్కిల్‌లో ఏకంగా హైవేను ఆనుకొని ఉన్న ప్రధాన రేడియల్​ రోడ్డునే కబ్జా చేశారు అక్రమార్కులు. పాత జీపీ లేఅవుట్​ ప్లాన్‌లో ఉన్న ప్రధాన రోడ్డును కబ్జా చేసిన అధికార పార్టీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్సీ.. రోడ్డుపై యథేచ్ఛగా భారీ కన్‌స్ట్రక్షన్ ​బారికేడ్లు ఏర్పాటు చేశారు. కబ్జాలు, ఆక్రమణలను వెంటనే అడ్డుకొని తొలగించాల్సిన అధికార యంత్రాంగం.. చూసీ చూడనట్లు వదిలేస్తూ.. సదరు మాజీ ప్రజాప్రతినిధికి కొమ్ముకాస్తుండడంపై నాగోల్​ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రోడ్డు ఆక్రమణను తొలగించి ప్రజా రవాణా స్తంభించకుండా ట్రాఫిక్​ కష్టాలు తీర్చాలని డిమాండ్​ చేస్తున్నారు.

ఇదీ అసలు విషయం..

ఎంఎంసీ ఎల్బీనగర్​ జోన్​నాగోల్​ సర్కిల్, డివిజన్.. ఉప్పల్​ మండల రెవెన్యూ పరిధిలోని ఉప్పల్ – ఎల్బీనగర్​ హైవేను ఆనుకొని నాగోల్, జైపూర్​ కాలనీ, ఆనంద్​నగర్, తదితర సమీప ప్రాంతాలకు వెళ్లే 40 ఫీట్ల ప్రధాన రహదారి ఉంది. నాగోల్​అభివృద్ధి చెందుతున్న క్రమంలో అధికార యంత్రాంగం ట్రాఫిక్​ రద్దీ దృష్ట్యా రోడ్డును విస్తరించి డివైడర్‌ను కూడా ఏర్పాటు చేశారు. క్రమంగా ఔటర్​ రింగ్ ​రోడ్డుకు వెళ్లే రేడియల్ ​రోడ్డుగా కూడా డెవలప్​ చేశారు. నాలుగేళ్ల కిందట సదరు రోడ్డును ఆనుకొని ఉన్న ఫ్లాట్ యజమాని, మాజీ ఎమ్మెల్సీ అందులోని హోటల్‌ను తొలగించి భారీ కమర్షియల్​భవన నిర్మాణ పనులు షురూ చేశారు. ఈ క్రమంలో రేడియల్ ​రోడ్డులో సగం.. నాగోల్​వెళ్లే మార్గాన్ని పూర్తిగా ఆక్రమించి భారీ కన్​స్ట్రక్షన్​బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ఉప్పల్​టూ ఎల్బీనగర్​ రోడ్డు ట్రాఫిక్​ జామ్‌కు కేరాఫ్‌గా మారుతున్నది.

ఇదేమిటని వాహనదారులు, స్థానికులు ప్రశ్నిస్తే.. కొంత వెనక్కి జరిగినట్లు జరిగి.. మళ్లీ యథావిధంగా ఆక్రమించారు. దీనిపై స్థానికులు ఎంఎంసీ టౌన్​ప్లానింగ్​ అధికారులకు ఫిర్యాదులు చేసినా.. కనీసం అటు వైపు కన్నెత్తి కూడా చూడలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. సదరు మాజీ ఎమ్మెల్సీని స్థానికులు ప్రశ్నిస్తే.. ‘పాత జీపీ లే అవుట్​ ప్రకారం తన ప్లాట్​భూమి అక్కడి వరకు ఉంది’ అని.. ఆ విషయం అధికారులకు కూడా తెలుసు అంటూ సమాధానం ఇచ్చారంటూ స్థానికులు చెబుతున్నారు. ఎవరు వచ్చి అడుగుతారో అడగనివ్వండి.. అంటూ జబర్దస్తీగా చెప్తున్నారంటూ స్థానికులు వాపోతున్నారు.

ఎంఎంసీ అధికారుల మౌనం వెనుక ఆంతర్యమేమిటి?

పేదలు చిన్నపాటి నిర్మాణాలు చేపట్టినా.. డీవియేషన్స్​, సెట్‌బ్యాక్ లేవంటూ కూల్చివేస్తామని హెచ్చరించే ఎంఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు.. రోడ్డు ఆక్రమణలపై నాలుగేళ్లుగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సోషల్​ మీడియాలో ట్విట్టర్​ వేదికగా జీహెచ్​ఎంసీ, ట్రాఫిక్​, పోలీస్​, హైడ్రా ఇలా అన్ని విభాగాల ఉన్నతాధికారులకు వందల మంది ఫిర్యాదులు చేసినా.. చర్యలు తీసుకుంటామని రిప్లై ఇచ్చారే తప్పా.. కనీసం అటువైపు కూడా కన్నెత్తి చూడలేదని స్థానికులు వాపోతున్నారు. రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయంటూ కొంత మంది అధికారులు వాపోవడం కూడా గమనార్హం. అయితే ఇటీవల జనగణన కార్యక్రమాల పర్యవేక్షణలో భాగంగా ఎంఎంసీ కమిషనర్ వినయ్‌కృష్ణారెడ్డి తరచూ నాగోల్ సర్కిల్‌లో పర్యటిస్తున్నప్పటికీ ఈ ఆక్రమణలు కనిపించడం లేదా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

హైడ్రాకు ఆక్రమణ కనిపించడం లేదా?

ఇటీవల కాలంలో కాలనీల్లో చిన్న చిన్న రోడ్లు ఆక్రమణకు గురైనా వెంటనే స్పందించి ఆక్రమణలు తొలగిస్తున్న హైడ్రా అధికారులు.. నాగోల్​ సెంటర్‌లో హైవేను ఆనుకొని ఉన్న ప్రధాన రోడ్డు కబ్జాపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. నాగోల్​ సర్కిల్​ పరిధిలోని కుంట్లూరు, పెద్ద అంబర్‌పేట్ డివిజన్లలో అక్రమ నిర్మాణాలను, ప్రైవేట్​వ్యక్తులు రోడ్డును ఆక్రమించడంతో రోడ్డు ఆక్రమణలను తొలగించిన అధికారులు.. నాగోల్‌లోని ఈ ఆక్రమణల విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు.

రోడ్డును క్రమంగా మూసివేసేందుకు యత్నమా?

రెండేళ్లుగా అధికారులు పట్టించుకోకపోవడంతో సదరు మాజీ ఎమ్మెల్సీ.. ప్రభుత్వ పెద్దల అండతో అధికారులతో కలిసి రోడ్డును క్రమంగా ఆక్రమించి రోడ్డును శాశ్వతంగా మూసేసే వ్యూహాలు రచిస్తున్నారా? అంటూ ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వ పెద్దలు పార్టీలోని మాజీ ప్రజా ప్రతినిధులకు రహదారులను అప్పగించే సంస్కృతిని పెంపొందించుకుంటున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. బాజాప్తా రోడ్డుపై బారికేడ్లు పాతితే గత రెండేళ్లుగా అధికారులు కిమ్మనకుండా ఉండడం వెనుక ఆంతర్యమేమిటనే విమర్శలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా వెంటనే ఎంఎంసీ ఉన్నతాధికారులు స్పందించి రోడ్డును ఆక్రమించి కన్​స్ట్రక్షన్​ బారికేడ్లు ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకుని సజావుగా రాకపోకల జరిగేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story