వాన కాదు.. వడగండ్ల వరద!

by Muthe.Rajitha |

చైనా గ్వీయాంగ్ లో వడగళ్ల వరద పారింది. తుఫాను ధాటికి నగరంలో వీధులు, రోడ్లు నడుము లోతు వడగళ్ల ప్రవాహంతో నిండిపోయాయి.

వాన కాదు.. వడగండ్ల వరద!
X

దిశ, వెబ్ డెస్క్ : చైనాలోని గ్విజౌ ప్రావిన్స్‌లో వడగళ్ల వరద ప్రజలను వణికించింది. గురువారం సాయంత్రం హఠాత్తుగా సంభవించిన భారీ వడగళ్ల తుఫాను గ్వీయాంగ్ (Guiyang) నగరాన్ని అతలాకుతలం చేసింది. కేవలం కొద్ది నిమిషాల వ్యవధిలోనే 2 నుంచి 3 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన వడగళ్లు కురవడంతో జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. నగర వీధులు, ప్రధాన రహదారులు అన్నీ మంచు ముద్దలతో నిండిపోయి, చూస్తుండగానే వడగళ్ల వరదలా మారిపోయాయి. రోడ్లపై దాదాపు 15 నుండి 20 సెంటీమీటర్ల మందంతో వడగళ్ల పొర పేరుకుపోవడంతో, వాహనాలు కదలలేని పరిస్థితి ఏర్పడింది. స్థానిక ప్రజలు ఇది ఒక "ఐస్ ఏజ్" లాగా ఉందని సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వైరల్ అవుతున్నాయి.

ఈ అకాల తుఫానుతో వందలాది వాహనాలు రోడ్ల మధ్యలోనే నిలిచిపోవడంతో భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు దెబ్బతిని సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గ్వీయాంగ్‌తో పాటు పొరుగు ప్రాంతాలకు కూడా వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ చైనాలో ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న అత్యంత తీవ్రమైన వడగళ్ల సంఘటనలలో ఇది ఒకటిగా నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్లే ఇలాంటి అసాధారణ వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story