గురుకుల విద్యార్థిని సంగీత మృతి ఘటన.. ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు

by Kema Shiva Kumar |

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల పరిధిలోని బోర్లం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థిని సంగీత అన్యాయంగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

గురుకుల విద్యార్థిని సంగీత మృతి ఘటన.. ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల పరిధిలోని బోర్లం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థిని సంగీత ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. పాఠశాల ప్రిన్సిపాల్ బాధ్యతారాహిత్యం, ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ప్రిన్సిపాల్ సునీత, ఆటో డ్రైవర్ కాశీనాథ్‌లపై బీఎన్ఎస్ యాక్ట్ 106 (1) కింద కేసు నమోదు చేశారు. అందులో ప్రిన్సిపాల్ సునీత‌ను A1‌గా, ఆటో డ్రైవర్ కాశీనాథ్‌ను A2 నిందితుడిగా పేర్కొన్నారు. ఇక ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల ఆస్తులను వ్యక్తిగత పనులకు వాడటమే కాకుండా, చిన్నారి మృతికి కారణమైన ప్రిన్సిపాల్‌ సునీతపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

అసలేం జరిగిందంటే..?

బోర్లం గురుకుల పాఠశాలకు ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త ఫర్నీచర్‌ను ఇంచార్జ్ ప్రిన్సిపాల్ సునీత తన ఇంట్లో జరిగిన ఒక ఫంక్షన్ కోసం వాడుకున్నారు. అయితే, ఆదివారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఉండటంతో, ఆ ఫర్నీచర్‌ను తిరిగి స్కూల్‌కు తరలించేందుకు ఆమె విద్యార్థినులను వాడుకున్నారు. ఆటోలో వచ్చిన ఫర్నీచర్‌ను దించిన తర్వాత, నలుగురు విద్యార్థినులు తిరిగి అదే ఆటో ఎక్కారు. ఆ సమయంలో డ్రైవర్ కాశీనాథ్ విద్యార్థినులు సరిగ్గా కూర్చోక ముందే ఆటోను ఒక్కసారిగా స్టార్ట్ చేసి వేగంగా ముందుకు తీసుకెళ్లాడు. దీంతో భయాందోళనకు గురైన విద్యార్థినులు ఆపమని కేకలు వేసినా డ్రైవర్ వినలేదు. ప్రాణభయంతో నలుగురు విద్యార్థినులు ఆటోలో నుంచి బయటకు దూకేశారు. ఈ క్రమంలో సంగీత అనే విద్యార్థిని తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై మృతురాలి బంధువులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story