తెలంగాణలో 67 మంది రాజకీయ నేతలకు గన్‌మెన్ల తొలగింపు

by Malleboina Mahesh |

తెలంగాణలో రాజకీయ నేతలకు భద్రత రద్దు.. నేతి విద్యాసాగర్, నల్లగొండ మేయర్ భర్త సహా 67 మంది లీడర్లకు గన్‌మెన్లను తొలగించిన సర్కార్!

తెలంగాణలో 67 మంది రాజకీయ నేతలకు గన్‌మెన్ల తొలగింపు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో రాజకీయ నాయకుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటెలిజెన్స్ ఐజీ నేతృత్వంలోని సెక్యూరిటీ రివ్యూ కమిటీ (SRC) సిఫార్సుల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 67 మంది ప్రముఖ రాజకీయ నేతలకు భద్రతను పూర్తిగా తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు, సదరు నేతలకు ఉన్న ముప్పు (Threat) తీవ్రతను అంచనా వేసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలపై ప్రభావం..

రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఈ వీఐపీ భద్రత కోత జాబితాలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కీలక నేతలు ఉన్నారు. అందులో శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ కు ఇన్నాళ్లూ కొనసాగిన గన్‌మెన్ల భద్రతను ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. అలాగే నల్లగొండ మున్సిపల్ మేయర్ భర్త, బీఆర్ఎస్ (BRS) నేత కరీం ఖాన్‌ కు కేటాయించిన గన్‌మెన్లను కూడా వెనక్కి రప్పించారు. వీరితో పాటు బీజేపీకి చెందిన మరో ఇద్దరు ముఖ్య నేతలకు ఉన్న భద్రతను సైతం హోం శాఖ రద్దు చేసింది.

ఈ విడతలో భద్రత కోల్పోయిన వారిలో మెజార్టీ నేతలు మాజీ ప్రజాప్రతినిధులు, గత ప్రభుత్వ హయాంలో గన్‌మెన్లను పొందిన వారేనని సమాచారం. ప్రభుత్వ తాజా నిర్ణయంతో సదరు నాయకులకు కేటాయించిన గన్‌మెన్లు అందరూ తక్షణమే హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ పరిణామం ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Next Story