తమిళనాడు అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్.. 13 కారణాలతో లోక్ భవన్ ప్రెస్ నోట్

by Malleboina Mahesh |   (  Updated:2026-01-20 05:53:28  IST  )

తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజు గందరగోళ వాతావరణం నెలకొంది. అసెంబ్లీ ప్రారంభంలో వందేమాతరం పాడటానికి డీఎంకే ప్రభుత్వం ఇష్టపడకపోవడంతో గవర్నర్ ఆర్.ఎన్. రవి ప్రసంగించకుండానే వెనుదిరిగారు.

తమిళనాడు అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్.. 13 కారణాలతో లోక్ భవన్ ప్రెస్ నోట్
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజు గందరగోళ వాతావరణం నెలకొంది. అసెంబ్లీ ప్రారంభంలో వందేమాతరం పాడటానికి డీఎంకే ప్రభుత్వం ఇష్టపడకపోవడంతో గవర్నర్ ఆర్.ఎన్. రవి ప్రసంగించకుండానే వెనుదిరిగారు. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ముఖ్యంగా గవర్నర్ మాట్లాడుతుండగా అధికార డీఎంకే సభ్యులు పెద్ద ఎత్తున నిరసనలు చేయడం, పదే పదే గవర్నర్ మైక్ కట్ చేయడంతో ఆయన సభ నుంచి వెళ్లిపోయినట్లు వార్తలు వచ్చాయి అనంతరం గవర్నర్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడానికి 13 ప్రధాన కారణాలను వివరిస్తూ లోక్ భవన్ అధికారికంగా ప్రెస్ రిలీజ్ విడుదల చేసింది. ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగంలో అనేక అవాస్తవాలు ఉన్నాయని, ప్రజలను వేధిస్తున్న కీలక సమస్యలను ప్రభుత్వం కావాలనే విస్మరించిందని గవర్నర్ ఆరోపించారు. ముఖ్యంగా తన మైక్‌ను పదేపదే స్విచ్ ఆఫ్ చేయడం, మాట్లాడనీయకుండా అడ్డుకోవడం పట్ల ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో నెలకొన్న సామాజిక, ఆర్థిక విఫలాలను గవర్నర్ తన నివేదికలో ఎండగట్టారు. రాష్ట్రంలో మహిళా భద్రతను పూర్తిగా గాలికొదిలేశారని, పోక్సో (POCSO) అత్యాచార కేసులు 55 శాతం, లైంగిక వేధింపుల కేసులు 33 శాతం పెరగడం ఆందోళనకరమని పేర్కొన్నారు. అలాగే, మాదకద్రవ్యాల వినియోగం వల్ల ఏడాదికి సుమారు 2000 మంది యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, దీనిపై ప్రభుత్వం మౌనంగా ఉందని విమర్శించారు. రాష్ట్రంలో ఏడాదికి 20,000 ఆత్మహత్యలు జరుగుతున్నాయని, రోజుకు సగటున 65 మంది బలవన్మరణానికి పాల్పడుతుండటంతో తమిళనాడు 'భారతదేశ ఆత్మహత్యల రాజధాని'గా మారుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యా వ్యవస్థలో ప్రమాణాలు పడిపోవడంతో పాటు 50 శాతానికి పైగా ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇది యువత భవిష్యత్తును అంధకారంలోకి నెడుతోందని గవర్నర్ విమర్శించారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడం, వేలాది దేవాలయాలను బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు లేకుండా ప్రభుత్వమే నేరుగా నిర్వహించడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని పేర్కొన్నారు. 12 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్న ప్రభుత్వ వాదన కేవలం కాగితాలకే పరిమితమని, గతంలో నాలుగో స్థానంలో ఉన్న తమిళనాడు ఇప్పుడు ఆరో స్థానానికి పడిపోయిందని ఎద్దేవా చేశారు. వీటన్నింటికీ తోడు జాతీయ గీతాన్ని మరోసారి అవమానించడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేస్తూ, అందుకే తాను ప్రసంగించలేదని గవర్నర్ వివరణ ఇచ్చారు.





Next Story