- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేడే గుడ్ న్యూస్.. గిగ్ వర్కర్ల బిల్లుకు గవర్నర్ ఆమోదం
"తెలంగాణ ఫ్లాట్ ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ - 2026 బిల్లుకు గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో గిగ్ ఎకానమీపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది కార్మికుల జీవితాల్లో మేడే సందర్భంగా కొత్త వెలుగులు నిండనున్నాయి. ప్రభుత్వం రూపొందించిన "తెలంగాణ ఫ్లాట్‌ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ లేబర్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్) బిల్లు 2026" చట్టరూపం దాల్చింది. గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ఈ చారిత్రక బిల్లుకు ఆమోదం తెలపడంతో, రాజస్థాన్ తర్వాత గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చిన రెండో రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ బిల్లుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది.
బిల్లులో ఏముంది?
ఈ చట్టం ఉబర్, ఓలా, స్విగ్గీ, జొమాటో వంటి ప్లాట్‌ఫామ్‌లలో పనిచేసే డెలివరీ భాగస్వాములు మరియు డ్రైవర్లకు సమగ్ర రక్షణ కల్పిస్తుంది. గిగ్ వర్కర్లకు కేవలం పని మాత్రమే కాకుండా, వారికి, వారి కుటుంబాలకు అండగా నిలిచేలా ప్రమాద భీమా (Accident Insurance), ఆరోగ్య భీమా మరియు పెన్షన్ సౌకర్యాలను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. గిగ్ వర్కర్ల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కేలా కనీస వేతనాన్ని నిర్ణయించారు. అంతేకాకుండా, ప్లాట్‌ఫామ్ కంపెనీలు వచ్చే ఆదాయంలో కనీసం 50% వాటాను వర్కర్లకు ఇవ్వాలని నిబంధన విధించారు. గతంలో కంపెనీలు ఎటువంటి నోటీసు లేకుండా వర్కర్ల ఐడీలను డీ-యాక్టివేట్ చేసేవి. ఇప్పుడు ఈ చట్టం ప్రకారం, సరైన కారణం లేకుండా ఏకపక్షంగా వర్కర్లను పనిలో నుంచి తొలగించడానికి వీలులేదు. గిగ్ వర్కర్లను కూడా సాధారణ కార్మికుల వలె గుర్తించి, వారికి గ్రాట్యుటీ మరియు కాంట్రాక్ట్ రక్షణ కల్పించేలా నిబంధనలు రూపొందించారు.
గిగ్ వర్కర్ల హర్షం
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4.5 లక్షల మంది గిగ్ వర్కర్లకు ఈ చట్టం ద్వారా నేరుగా ప్రయోజనం చేకూరనుండటంతో వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గిగ్ వర్కర్స్ యూనియన్స్ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ బిల్లు చట్ట రూపం దాల్చడంతో డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు సహా అసంఘటిత రంగంలో పని చేస్తున్న లక్షలాది కార్మికులకు పని భద్రత, ప్రమాద, ఆరోగ్య బీమా, ఇతర సామజిక భద్రతా పథకాలు వర్తించనున్నాయి. కాగా ఇందుకు సంబంధించిన పూర్తి గైడ్ లైన్స్ 10-15 రోజుల్లో వెలువడనున్నాయి.






