మంథని అధికార పార్టీలో గంజాయి స్మగ్లింగ్‌ కేసు కలకలం

by Disha Web Desk |
మంథని అధికార పార్టీలో గంజాయి స్మగ్లింగ్‌ కేసు కలకలం
X

దిశ, మంథని : మంథని పట్టణానికి చెందిన ఓ ప్రముఖ నాయకుడి అల్లుడు గంజాయిని రవాణా చేస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న అతడు రెండు కార్లలో గంజాయిని తరలిస్తూ మహారాష్ట్ర పోలీసులకు పట్టుబడటం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సంచలనంగా మారింది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దుర్భుద్దితో తన మామ అండదండలతో స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్లు చర్చ జరుగుతోంది. అతడితోపాటు గతంలో సదరు నాయకుడికి డ్రైవర్‌గా పని చేసిన వ్యక్తి కూడా పోలీసులకు చిక్కాడు.

తెలంగాణ నుండి నాగపూర్ మీదుగా బొంబాయి తరలిస్తున్న సుమారు రూ.30 లక్షల విలువైన గంజాయిని ఇటీవల నాగపూర్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడితో పాటు డ్రైవర్ పై కేసు నమోదు చేసి రెండు కార్లను సీజ్ చేసినట్లు ఆ రాష్ట్ర పత్రికల్లో కథనాలు ప్రచురితం అయ్యాయి. దీంతో ఈ ఘటన అధికార పార్టీలో సంచలనం సృష్టిస్తోంది. గతంలో సదరు ప్రజాప్రతినిధి కుమారుడు నకిలీ పోలీసు అవతారమెత్తి పెద్ద ఎత్తున అక్రమాలు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన అల్లుడు గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడటం విస్మయానికి గురి చేసింది. ఒకేసారి పెద్ద ఎత్తున గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారంటే గతంలో కూడా ఇదే విధంగాచేసి ఉంటారనే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఇద్దరు మాత్రమే ఈ దందా కొనసాగిస్తున్నారా లేక వారి వెనకాల ఎవరైనా ఉన్నారా? అనే అంశం పోలీసుల విచారణలో తేలనుంది. ఏది ఏమైన ఈ ఘటన ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.


Next Story

Most Viewed