ఆ నియోజకవర్గంలో జనసేన ప్రభంజనం.. రోజురోజుకి పాతాలానికి పడిపోతున్న వైసీపీ గ్రాఫ్

by Disha Web Desk 3 |
ఆ నియోజకవర్గంలో జనసేన ప్రభంజనం.. రోజురోజుకి పాతాలానికి పడిపోతున్న వైసీపీ గ్రాఫ్
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: పెందుర్తి నియోజకవర్గం రోజురోజుకూ జనసేనకు అనుకూలంగా మారుతుంది. ప్రభుత్వం పట్ల వ్యతిరేకత, వైసీపీ ఎమ్మెల్యే అరాచకాలు, అక్రమాలు, అవినీతి జనసేనకు సానుకూలంగా మారాయి. వాటికి తోటు ఈ నియోజక వర్గానికి చెందిన కూటమి పక్షాల ప్రధాన నేతలకు టికెట్లు, పదవులు రావడంతో వారి అనుచరగణం కలసికట్టుగా పని చేస్తున్నారు. విశాఖ నగర శివారులోని అతి పెద్ద నియోజకవర్గమైన అనకాపల్లి జిల్లా పెందుర్తి ఇప్పటి వరకు రెండో పర్యాయం ఎవ్వరికీ అవకాశం ఇవ్వలేదు. వరుసగా ఎవ్వరూ గెలవ లేదు. విచిత్రంగా ఈ ఎన్నికలలో గతంలో ఇక్కడి నుంచి గెలిచిన అభ్యర్థులిద్దరూ పోటీ పడుతున్నారు. వైపీపీ నుంచి ప్రస్తుత శాసనసభ్యుడు అన్నంరెడ్డి అదీప్ రాజ్ పోటీ చేస్తుండగా, పొత్తులో భాగంగా జనసేన నుంచి మాజీ శాసన సభ్యుడు పంచకర్ల రమేష్ బాబు బరిలో ఉన్నారు.

సీఎం రమేష్ ఎంపీ అభ్యర్థి కావడం ప్లస్

అనకాపల్లి ఎంపీ అభ్యర్దిగా బీజేపీ సీనియర్ నేత సీఎం రమేష్ రావడంతో అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని కూటమి అసెంబ్లీ అభ్యర్థులందరికీ ధైర్యం వచ్చింది. ఆర్థికంగా అండగా ఉండడంతోపాటు రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసి కేంద్రంలో పలుకుబడి కలిగిన ఆయన విషయంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తుండడం వీరికి కలసి వస్తుంది. తనతోఃపాటు ఏడుగురు అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించి తీరతానని పదే పదే ప్రకటిస్తూ అందుకు తగ్గట్టుగా కార్యాచరణ రూపొందిస్తున్నారు.

బండారు కు మాడుగల టికెట్ తో రిలీఫ్

తెలుగుదేశం పార్టీ నుంచి పెందుర్తి టికెట్ ఆశించిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి ఆఖరి నిమిషంలో పక్కనే ఉన్న మాడుగుల టికెట్ కేటాయించడం పంచకర్లకు పెద్ద రిలీఫ్ ఇచ్చింది. టికెట్ ఖరారయ్యేంత వరకూ బండారు అలకలో ఉన్నారు. పంచకర్లకు సహకరించ లేదు. టికెట్ ఖరరయ్యాక ఏర్పాటు చేసిన సమావేశంలో పంచకర్లను గెలిపించాల్సిందిగా బండారు పిలుపు నచ్చారు. కాపులు , కొప్పుల వెలమలు మెజారిటీలుగా వున్న ఈ నియోజక వర్గంలో పంచకర్ల కాపు కాగా, బండారు కొప్పుల వెలమ. వీరిద్దరి కలయిక ఇఫ్పుడు వర్కవుట్ అయ్యేట్లు కనిపిస్తుంది.

గండి బాబ్జీకి ఇన్చార్జి పోస్టుతో మరింత మద్దతు

పెందుర్తి నియోజక వర్గానికే చెందిన మాజీ శాసనసభ్యుడు గండి బాబ్జీ నాలుగు రోజుల క్రితం వరకూ విశాఖ దక్షిణనియోజక వర్గ తెలుగుదేశం ఇన్చార్జిగా ఉన్నారు. ఆ సీటు కూడా జనసేనకు వెళ్లడంతో పార్టీ అధిష్టానం ఆయనను బుజ్జగించి విశాఖ అధ్యక్షుడిగా నియమించింది. అయితే, భవిష్యత్ రాజకీయ అవసరాల దృష్ట్యా తనను పెందుర్తి ఇన్చార్జిగా నియమించాల్సిందిగా కోరారు .అందుకు అధిష్టానం అంగీకరించి నియమించడం ఇప్పడు పంచకర్లకు అనుకూలంగా మారింది. అటు బండారు, ఇటు బాబ్జీ చెరోవైపు పంచకర్ల కోసం పని చేస్తే ,వారి మద్దతు దారులు కలసి వస్తే ఇక తిరుగే ఉండదని అంటున్నారు.



Next Story

Most Viewed