సమస్యల సుడిగుండంలో సర్కారు బడులు.. తొలిరోజే సెంటిమెంట్ల ఎఫెక్ట్

by Malleboina Mahesh |

ఉమ్మడి పాలమూరులో నేటి నుండి బడులు ప్రారంభం. వసతుల లేమి, టీచర్ల కొరత వేధిస్తున్నా.. 'కడ' పరిధిలో విద్యార్థులకు ఉదయం అల్పాహారం షురూ.

సమస్యల సుడిగుండంలో సర్కారు బడులు.. తొలిరోజే సెంటిమెంట్ల ఎఫెక్ట్
X

దిశ, మహబూబ్‌నగర్ బ్యూరో: వేసవి సెలవులు ముగిశాయి. ఎండల తీవ్రత కారణంగా రెండు రోజులు ఆలస్యంగానైనా, ఎట్టకేలకు కొత్త విద్యా సంవత్సరం నేటి (సోమవారం) నుంచి ప్రారంభం కానుంది. బడులు తెరిచేందుకు ఇటు ప్రభుత్వ, అటు ప్రైవేటు విద్యాసంస్థలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. అయితే, తొలిరోజు పాఠశాలల్లో విద్యార్థుల హాజరు ఎంతవరకు ఉంటుందనేది ప్రశ్నార్థకంగా మారింది. సోమవారం 'అమావాస్య' కావడం, మరుసటి రోజు 'మంగళవారం' కావడంతో సెంటిమెంట్ ప్రకారం మెజారిటీ తల్లిదండ్రులు తమ పిల్లలను బుధవారం నుంచే బడికి పంపే యోచనలో ఉన్నారు. దీంతో బుధవారం నుంచే పాఠశాలలు పూర్తిస్థాయిలో కళకళలాడే అవకాశం కనిపిస్తోంది.

ఎక్కడి సమస్యలు అక్కడే..

కొత్త విద్యా సంవత్సరం ఉత్సాహంగా ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను పాత సమస్యలు విడనాడటం లేదు. అనేక పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేవు. ప్రహరీ గోడల నిర్మాణాలు అధ్వానంగా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా విద్యార్థినులకు పూర్తిస్థాయిలో టాయిలెట్ల వసతి లేకపోవడం శాపంగా మారింది. జోగులాంబ గద్వాల, నారాయణపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉపాధ్యాయ ఖాళీలు గుండెకోత మిగులుస్తున్నాయి. గతేడాది సబ్జెక్టుల వారీగా టీచర్లు లేకపోవడంతో విద్యార్థులు ఆశించిన స్థాయిలో మార్కులు సాధించలేకపోయారు. ఈ ఏడాది కూడా అదనపు గదుల నిర్మాణాలు, మరమ్మతులు, టీచర్ల సర్దుబాటు చేయకుండానే విద్యాసంస్థలు ప్రారంభమవుతుండటంతో విద్యార్థులు సమస్యల మధ్యే చదువులు కొనసాగించాల్సిన దుస్థితి నెలకొంది.

ఎంపిక చేసిన పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు..

ఈ ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం సరికొత్తగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల్లో 'ప్రీ-ప్రైమరీ' తరగతులను ప్రయోగాత్మకంగా ప్రారంభించబోతోంది. ఇందుకు అవసరమైన బోధన, బోధనేతర సిబ్బంది నియామకం కోసం దరఖాస్తులు సైతం భారీగా వచ్చాయి. అయితే, నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేసే ప్రక్రియలో అధికారులు కొంత గడువు తీసుకుంటున్నారు. పలు కారణాల వల్ల ఈ ఎంపిక ప్రక్రియ వాయిదా పడుతూ వస్తుండటంతో, తొలిరోజే ఈ తరగతులకు సంబంధించిన రాకపోకలు, విద్యాబోధన పెద్దగా ఉండకపోవచ్చనే ప్రచారం క్షేత్రస్థాయిలో సాగుతోంది.

కడ పరిధిలోని విద్యార్థులకు అల్పాహారం..

కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కడ) పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం పూట అల్పాహారం అందించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. కడ పరిధిలోని కోస్గి, మద్దూరు, కొత్తపల్లి, గుండుమల్ మండలాల్లోని పాఠశాలల్లో ఈ పథకం నేటి నుంచి అమల్లోకి రానుంది. తొలి రోజైన సోమవారం విద్యార్థులకు పాలు మాత్రమే పంపిణీ చేయనుండగా, మంగళవారం నుంచి మెనూ ప్రకారం అల్పాహారాన్ని అందించనున్నారు. దీనికోసం విద్యాశాఖ అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయడంతో పాటు పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Next Story