స్టాంప్ డ్యూటీ ఎగవేత బాగోతం.. స్లాట్ బుకింగ్‌తోనే స్కాం మొదలు

by Gantepaka Srikanth |

స్టాంప్ డ్యూటీ స్కాంపై ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నది.

స్టాంప్ డ్యూటీ ఎగవేత బాగోతం.. స్లాట్ బుకింగ్‌తోనే స్కాం మొదలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్టాంప్ డ్యూటీ స్కాంపై ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా లావాదేవీలు, చెల్లించిన స్టాంప్ డ్యూటీ, చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ ఎంతనేది పరిశీలిస్తున్నారు. ఇప్పటికే అనుమానం ఉన్న, స్లాట్ క్యాన్సిల్ చేసుకున్న ట్రాన్సక్షన్స్ డేటాను కలెక్టర్లకు అందించారు. కలెక్టరేట్ల నుంచి తహశీల్దార్లకు డేటా వచ్చింది. ప్రధానంగా హెచ్ఎండీఏ పరిధిలోని జిల్లాల్లోనే వ్యత్యాసాలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఐతే ఇది ఎలా జరిగింది? దీని వెనుక ఉన్నది ఎవరు? తహశీల్దార్లే అసలు సూత్రధారులా? ఇంకెవరైనా ఉన్నారా? అన్న కోణంలో ఎంక్వయిరీ జరుగుతున్నట్టు తెలుస్తున్నది. ఐతే స్టాంప్ డ్యూటీ తక్కువగా చెల్లించిన కాలంలో పనిచేసిన తహశీల్దార్లు, మీ సేవా కేంద్రం నిర్వాహకులు, భూ భారతి(ధరణి) ఆపరేటర్లు ఎవరో సమాచారం ఇవ్వాల్సిందిగా ఎమ్మార్వోలకు కలెక్టర్ల నుంచి ఆదేశాలు అందాయి. ఇదే అంశంపై కొన్ని జిల్లాల్లో తహశీల్దార్లకు వీడియో కాన్ఫరెన్సులో ఎలా వెరిఫై చేయాలో కలెక్టర్లు వివరించారు.

స్టాంప్ డ్యూటీ ఎగవేత బాగోతం

ఉద్దేశపూర్వకంగానే చలాన్లు తక్కువగా కట్టి, వాటి అంకెలు దిద్ది తహశీల్దార్లకు సమర్పించారని గుర్తించారు. అలాంటి వాటిపై దృష్టి సారించారు. ఐతే ఇది మీ సేవ, భూ భారతి ఆపరేటర్ల వల్లనే కాలేదని, ఎవరో సీసీఎల్ఏ నుంచి సహకారం అందించి ఉంటారన్న అనుమానాలు బలపడుతున్నాయి. పైగా ఒక మండలంలోని ల్యాండ్ ట్రాన్సక్షన్ స్లాట్ మరో మండలం నుంచి బుక్ చేసినట్లు రికార్డులు చెప్తున్నాయి. జనగామలో చోటు చేసుకున్న 10 ట్రాన్సక్షన్స్ కూడా యాదగిరిగుట్టలోని ఆపరేటర్ ద్వారా చేశారు. ఎక్కువగా 2021, 2022 సంవత్సరాల్లోనే అత్యధికంగా ఉన్నట్లు రెవెన్యూ అధికారులు చెప్పారు. ఈ అంశంపై లోతైన దర్యాప్తు చేస్తే తప్ప వాస్తవాలు వెలుగులోకి రావంటున్నారు. అంటే అప్పటి నుంచే ఈ స్టాంప్ డ్యూటీ ఎగవేత బాగోతం నడుస్తుంది. ఐతే మీ సేవా కేంద్రం నిర్వాహకులు, భూ భారతి(ధరణి) ఆపరేటర్లపైనే మొత్తం స్కాంను నెట్టేసే అవకాశాలు ఉన్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది.

అక్కడొక్కడి.. ఇక్కడొక్కటి..

స్లాట్ బుక్ చేసేటప్పుడే అప్‌లోడ్ చేసే చలానాల్లో వ్యత్యాసం ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఓ జిల్లాలో 18 గుంటల లావాదేవీకి స్టాంప్ డ్యూటీ రూ.12 వేలు అవుతుంది. తహశీల్దార్ దగ్గర ఫైల్ డౌన్‌లోడ్ చేస్తే రూ.12 వేలు చెల్లించినట్లుగా ఉంది. అదే సీసీఎల్ఏ నుంచి కలెక్టర్ల ద్వారా తహశీల్దార్లకు పంపిన జాబితాలో రూ.7 వేలు మాత్రమే కట్టినట్లు చూపిస్తున్నది. కలెక్టర్ ఆదేశాల మేరకు సదరు తహశీల్దార్ ఎంక్వయిరీ ప్రారంభించారు. స్లాట్ బుక్ చేసిందేమో రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం హిమాయత్ సాగర్‌లోని ఓ మీ సేవా కేంద్రం నుంచి కొనుగోలు చేసిందేమో మరో జిల్లాకు చెందిన వారు. సదరు ఆపరేటర్‌కు తహశీల్దార్ ఫోన్ చేసి ఫలానా డాక్యుమెంట్ ఫైల్ పట్టుకొని రావాలని ఆదేశించారు. ఐతే తన దగ్గర ఎలాంటి డాక్యుమెంట్ ఉండదని, రోజూ అనేక స్లాట్స్ బుక్ చేస్తుంటామని తప్పించుకున్నాడు. కొనుగోలు చేసిన వ్యక్తిని అడిగితే తాను సరిగ్గానే డబ్బులు ఇచ్చానని చెప్పాడు. ఇప్పుడు తప్పు ఎవరి దగ్గర జరిగిందో కనిపెట్టడం అంత ఈజీగా కనిపించడం లేదు. జీహెచ్ఎంసీ, దానికి అత్యంత సమీపంలోని భూముల మార్కెట్ విలువే రూ.కోట్లల్లో ఉన్నది. ఇక్కడి లావాదేవీలు రూ.కోట్లల్లో ఉంటాయి. గండిపేట, శేరిలింగంపల్లి, బాలానగర్, పటాన్ చెరు, రాజేంద్రనగర్ మండలాల్లోని ల్యాండ్స్‌కే అత్యంత విలువ. ఈ లావాదేవీల్లోనూ రూ.లక్షల్లో వ్యత్యాసం ఉన్నట్లు రెవెన్యూ అధికారులు చర్చించుకుంటున్నారు. సిటీకి దగ్గర ఓ ట్రాన్సక్షన్‌లో స్టాంప్ డ్యూటీ రూ.70 లక్షలకు గాను రూ.12 లక్షలతోనే సరిపెట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి రూ.కోట్ల విలువైన ల్యాండ్స్ ట్రాన్సక్షన్లపై ఇప్పటికే అనేక అవినీతి, అక్రమాలు జరిగినట్లు చర్చ నడుస్తున్నది. ఇప్పుడేమో స్టాంప్ డ్యూటీ కూడా సరియగు రీతిలో చెల్లించారా? అక్కడ కూడా కోత పెట్టారా? అన్న అంశంపై రెవెన్యూ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.

సిస్టంలో లోపమేనా?

సంగారెడ్డి జిల్లాలోని ఓ మండలంలో 10 ఎకరాల అసైన్డ్ భూమిని సేల్ డీడ్ చేసేందుకు స్లాట్ బుక్ అయ్యింది. స్టాంప్ డ్యూటీ కూడా కట్టారు. ఐతే అక్కడి తహశీల్దార్ నివ్వెరపోయారు. తాను రిజిస్ట్రేషన్ చేయలేనంటూ తెగేసి చెప్పారు. పెద్ద మొత్తంలో ఆశ చూపినా రిజెక్ట్ చేశారు. దాంతో ఆ తహశీల్దార్ స్లాట్ బుక్ అయినప్పటికీ రిజిస్ట్రేషన్ చేయడం లేదంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ కూడా తహశీల్దార్‌పై సీరియస్ అయ్యారు. దాంతో అప్పటికప్పుడు రికార్డులన్నీ కలెక్టరేట్‌కి వెళ్లి కలెక్టర్‌కి చూపించారు. పీవోబీలోని అసైన్డ్ భూమికి స్లాట్ ఎలా బుక్ అయ్యిందని అందరూ ఆశ్చర్యపోయారు. ఎక్కడికక్కడ రికార్డులు భద్రంగా ఉన్నప్పటికీ ల్యాండ్స్ చేతులు మారడానికి తెరవెనుక సహకారం ఎక్కడి నుంచి అందిందో అంచనా వేయడం కలెక్టర్ స్థాయి అధికారులకు పెద్ద పని కాదు. ఇది ఏడాది క్రితం చోటు చేసుకున్నది. కానీ, ఇక్కడేమో తహశీల్దార్ గుర్తించి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేయగలిగారు. కానీ తహశీల్దార్ కూడా స్లాట్ బుక్ అయినప్పుడు రిజిస్ట్రేషన్ నిలిపివేసే అధికారం తనకు లేదని చేసే వాళ్లు ఎంతో మంది ఉన్నారు. ప్లాట్లుగా మారిన ల్యాండ్స్ ట్రాన్సక్షన్లు చేసిన ఉదంతాలు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో కోకొల్లలుగా ఉన్నాయి. ఎవరైనా అడిగితే తామేం చేస్తాం? స్లాట్ బుక్ అయ్యింది? రిజెక్ట్ చేయడానికి తమకు అధికారం లేదంటూ బుకాయించిన తహశీల్దార్లు చాలా మంది ఉన్నారు. ఇక్కడ సిస్టంలోని లోపాల కారణంగానే స్లాట్లు బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఎంత స్టాంప్ డ్యూటీ చెల్లించాలో భూ భారతి, అంతకు ముందు ధరణి పోర్టల్ లెక్కించి చెప్తుంది. అలాగే చలానాలోని అమౌంట్‌ను కూడా చెక్ చేసుకోవాల్సిన టెక్నాలజీ కూడా ఉండాలి. తక్కువగా స్టాంప్ డ్యూటీ చెల్లిస్తే స్లాట్ బుకింగ్ ప్రాసెస్ ముందుకు వెళ్లకుండా బ్యాక్ ఎండ్‌లో వర్క్ జరగాలి కదా? అని రెవెన్యూ అధికారులు అంటున్నారు.

ఖజానా లూటీ చేసిందెవరు?

రాష్ట్ర వ్యాప్తంగా భూ క్రయ విక్రయాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఐతే ఎక్కడైతే స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సిన దాని కంటే తక్కువగా చలానా ఉన్నదో, అలాంటి జాబితాలను ఇప్పటికే తహశీల్దార్లకు పంపారు. మీ సేవా ఆపరేటర్లు, భూ భారతి ఆపరేటర్లను విచారించాలని తహశీల్దార్లకు ఆదేశాలు అందాయి. ఐతే ఏ లావాదేవీలోనైతే తక్కువ స్టాంప్ డ్యూటీ జమ అయ్యిందో, ఆ మొత్తాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి నుంచి పెనాల్టీతో సహా వసూలు చేయాలని కొందరు కలెక్టర్లు తహశీల్దార్లకు చెప్పారు. జనగామలోనూ సదరు రైతులకు నోటీసులు అందించారు. ఐతే తాము పూర్తి సొమ్ము చెల్లించామని, ఫేక్ చలానాలను అప్‌లోడ్ చేసిన వారే బాధ్యులంటూ వాదిస్తున్నారు. ఇంతకి ఎవరిని తప్పు పట్టాలో తెలియక అధికారులు అయోమయానికి గురవుతున్నారు. స్టాంప్ డ్యూటీ స్కాం ఏ స్థాయిలో జరిగింది? దీనికి సహకరించిన వారెవరు? ఈ విషయాలు స్పష్టం కాకుండా దోపిడీ సొమ్మును వెనక్కి రాబట్టడం అంత ఈజీ కాదని రెవెన్యూ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

గిఫ్ట్ డీడ్స్‌పైనా అనుమానం..

భూ క్రయ విక్రయాల్లో స్టాంప్ డ్యూటీని తగ్గించుకోవడానికి గిఫ్ట్ డీడ్ కూడా ఓ మార్గం. ఇందులో రక్త సంబంధీకులకు విక్రయిస్తూ చేసే గిఫ్ట్ డీడ్ స్టాంప్ డ్యూటీ రెండు శాతమే. ఇతర బంధుమిత్రులకు గిఫ్ట్ డీడ్ చేస్తే 5 శాతంగా ఉంది. ఐతే ఇతరులను కూడా రక్త సంబంధీకులుగా పేర్కొంటే 3 శాతం స్టాంప్ డ్యూటీకి ఎగనామం పెట్టినట్లే. రాష్ట్ర వ్యాప్తంగా ఈ గిఫ్ట్ డీడ్స్‌లో అమ్మకం దారు, కొనుగోలు దారుల మధ్య వాస్తవ రిలేషన్ షిప్‌ని ఎంక్వయిరీ చేస్తే అనేకం అవకతవకలు ఉన్నట్లు తేలుతుందంటున్నారు. గిఫ్ట్ డీడ్ చేసేటప్పుడు ఈ రిలేషన్స్ గురించి పట్టించుకునేంత తీరిక, ఓపిక కలిగిన తహశీల్దార్లు చాలా తక్కువే అని చర్చ జరుగుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా గిఫ్ట్ డీడ్స్ పెరిగిన నేపథ్యంలో వీటిపైనా సమగ్ర దర్యాప్తు చేస్తే రూ.కోట్లల్లోనే రాబడి తగ్గినట్లు గుర్తించొచ్చునని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Next Story