- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో జిల్లాలు కాబోయే నియోజకవర్గాలు ఇవే!
రాష్ట్రంలో జిల్లాలు, మండలాల పునర్విభజనపై సీఎం రేవంత్ స్పష్టమైన ప్రకటన చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో జిల్లాలు, మండలాల పునర్విభజనపై సీఎం రేవంత్ స్పష్టమైన ప్రకటన చేశారు. దీంతో ఇన్నాళ్లుగా కొనసాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. జిల్లాలు, మండలాల పునర్విభజన ఖాయమని స్పష్టమైంది. జిల్లాలు, మండలాలు, డివిజన్ల పునర్విభజనకు జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. గతంలో అశాస్త్రీయంగా జరిగిన జిల్లాలు, మండలాల ఏర్పాటుపై ఉద్యోగులు, అధికారులు, తెలంగాణ వాదుల నుంచి సైతం అసంతృప్తి వ్యక్తమైంది. ఒక్కో జిల్లాను ఒక్కో తీరుగా ఏర్పాటు చేయడం, ఒక అసెంబ్లీ నియోజకవర్గం రెండు, మూడు జిల్లాల్లో ఉండటం లాంటి వాటిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. గతంలో ఆర్డీవో స్థాయిలో ఉన్న రెవెన్యూ డివిజన్‌లను సైతం జిల్లాలుగా ఏర్పాటు చేశారని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనిని పరిశీలించిన ప్రభుత్వం ఒక ఫార్మాట్‌లో పునర్వభజన చేపట్టాలని భావిస్తున్నది.
17 నుంచి 20 జిల్లాలు
రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనలో భాగంగా ఒక్కో లోక్‌సభ ప్రాతిపదికన జిల్లాను ఏర్పాటు చేయాలని సర్కారు ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఇదే ప్రాతిపదికన చేపడితే రాజకీయంగానూ ఎలాంటి విమర్శలు, ఒత్తిళ్లు రావని భావిస్తున్నది. అదే సమయంలో చిన్న, పెద్ద జిల్లాలు అనే విమర్శలు, ఆరోపణలకు సైతం ఆస్కారం ఉండదని ఒక అంచనాకు వచ్చినట్టు తెలిసింది. జిల్లాల పునర్విభజనను రాజకీయంగా వాడుకోవాలని ప్రతిపక్షం చూస్తున్నదని ఇప్పటికే ప్రభుత్వంగ్రహించింది. లోక్‌సభ ప్రాతిపదికన జిల్లాలను ఏర్పాటు చేసి వాటికి చెక్ పెట్టాలని ఆలోచిస్తున్నది. జిల్లాలను ఇలా ఏర్పాటు చేస్తే ఎలాంటి కక్ష సాధింపులు, ఒక ప్రాంతాన్ని, ప్రతిపక్ష నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలను తీసివేయడం లాంటి విమర్శలకు ఆస్కారం ఉండదనే అంచనాకు వచ్చినట్టు తెలిసింది. పక్క రాష్ట్రమైన ఏపీలోనూ ఇదే ప్రాతిపదికన జిల్లాల పునర్వభజన చేశారు. భౌగోళకంగా పెద్దగా ఉన్న జిల్లాలను విభజించి అదనంగా ఏర్పాటు చేశారు. ఫలితంగా అక్కడ ఎలాంటి విమర్శలు లేవు. తెలంగాణలోనూ అదే విధానాన్ని అమలు చేయడం ద్వారా ప్రజలు, రాజకీయ నాయకులు, అధికారులు ఇలా అందరి నుంచి ప్రభుత్వానికి మద్దతు లభించే అవకాశం ఉందని సమాచారం. ఈ విధానంలో జిల్లాలు అటు చిన్నవిగా కాకుండా ఇటు మరీ పెద్దవిగా కాకుండా ఉంటాయని ప్రభుత్వ పెద్దలు అంచనా వేశారు. కనిష్టంగా 17 జిల్లాల నుంచి గరిష్ఠంగా 20 వరకు జిల్లాలు ఏర్పాటయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఏర్పాటు ఇలా..
మహబూబాబాద్ లోక్‌సభ సెగ్మెంట్ భౌగోళికంగా చాలా పెద్దది. ములుగు, నర్సంపేట, డోర్నకల్, పినపాక, ఇల్లందు, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాలు ఇందులో ఉన్నాయి. అదే విధంగా ఆదిలాబాద్జిల్లా భాగోళికంగా పెద్దది. మల్కాజ్‌గిరి లోక్‌సభ సెగ్మెంట్ భౌగోళికంగా చిన్నదే అయినా జనాభా మాత్రం చాలా ఎక్కువ. ఇలా ఒకటి, రెండు నియోజకవర్గాల్లో, జిల్లాల్లో మార్పులు, చేర్పులు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇవి మినహా లోక్‌సభ నియోజకవర్గాల వారిగానే కొత్త జిల్లాలు ఏర్పాటు అవుతాయని సమాచారం. చిన్న రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో ఏకంగా 33 జిల్లాలు ఏర్పాటు చేయడంపై దాదాపుగా అన్ని వర్గాలు నుంచి విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఇంత చిన్న జిల్లాలకు అధికారులకు పూర్తి స్థాయిలో పని లేకుండా పోయిందనే విమర్శలు వచ్చాయి. మరోవైపు 33 జిల్లాలు ఏర్పాటు కావడంతో ఐఏఎస్, ఐపీఎస్అధికారుల కొరత ఏర్పడింది. దీంతో జూనియర్ఐఏఎస్లు సర్వీసులో చేరిన నాలుగైదు సంవత్సరాల్లోనే, పరిపాలనపై పూర్తి స్థాయిలో పట్టురాక ముందే కలెక్టర్లుగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో పరిపాలనపై ప్రభావం పడిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
2017లో జిల్లాల ఏర్పాటు
ఉమ్మడి రాష్ట్రంలో 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణ.. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత నాటి సీఎం కేసీఆర్ 2017 దసరా నాడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. ఈ నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించకపోయినా ఇంత పెద్ద సంఖ్యలో జిల్లాలు ఏర్పాటు చేయడాన్ని అందరూ తప్పుపట్టారు. వనపర్తి, గద్వాల, జనగామ, సిరిసిల్ల, మెదక్, ములుగు, నారాయణపేట్చిన్న జిల్లాలుగా ఏర్పాటయ్యాయి. వరంగల్‌లాంటి చారిత్రక నేపథ్యం ఉన్న జిల్లాను ఏకంగా 6 జిల్లాలుగా విభజించారు. దానితో పాటుగా వరంగల్ నగరాన్ని రెండు విభజించి వరంగల్, హన్మకొండ అంటూ కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. వీటన్నింటిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. సీఎం రేవంత్ నియోజకవర్గం కొడంగల్ సహా మంత్రి పొన్నం ప్రాతినిద్యం వహిస్తున్న హుస్నాబాద్‌తో పాటు పాలకుర్తి, నర్సాపూర్, దేవరకద్ర, జనగామ, గజ్వేల్, హుజూరాబాద్, భూపాలపల్లి, పరకాల, ఆందోల్, ములుగు, మంథని, ఇలా అనేక నియోజకవర్గాలు రెండు మూడు జిల్లాల్లో ఉన్నాయి.
జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు
జిల్లాల పునర్విభజనపై సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్‌జడ్జి నేతృత్వంలో జ్యుడీషియల్కమిషన్ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో మాజీ ఐఏఎస్అధికారులు, రెవెన్యూ, పంచాయతీరాజ్అధికారులు ఉండనున్నారు. జిల్లాల పునర్విభజనను ఏ విధంగా చేయాలి? అందుకు సంబంధించిన మార్గదర్శకాలు, విధి విధానాలపై అసెంబ్లీ బడ్జెట్సమావేశాల్లో చర్చిస్తారు. ఆయా పార్టీలు వ్యక్తం చేసే అభిప్రాయాలు, ఆలోచనలు, సూచనలకు అనుగుణంగా మార్గదర్శకాలు జారీ చేస్తారు. అనంతరం కమిషన్అన్ని జిల్లాల్లో పర్యటిస్తుంది. అక్కడి జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగంతో సమావేశమవుతుంది. అక్కడ అవసరమైన అధికారిక సమాచారాన్ని సేకరిస్తుంది. అనంతరం ప్రజలు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, మేధావులు, ఇతరుల నుంచి అభిప్రాయాలు, సూచనలు, వినతులు స్వీకరిస్తుంది. అనంతరం వాటన్నింటినీ క్రొడీకరించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుంది. అనంతరం ఆ నివేదికను కేబినెట్‌లో ప్రభుత్వం చర్చించి ఆమోదిస్తుంది. అవసరమైతే ఆ నివేదికను సైతం అసెంబ్లీలో ప్రవేశపెట్టి సభ్యులతో చర్చించి జిల్లాల పునర్విభజనపై సర్కారు తుది నిర్ణయం తీసుకోనున్నది. డిసెంబర్ చివరి నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.






