భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

by Muthe.Rajitha |

ఓ వైపు మిడిల్ ఈస్ట్ దేశాల్లో యుద్ధం తీవ్రస్థాయికి చేరుకోగా.. అనూహ్యంగా బంగారం, వెండి ధరలు మాత్రం భారీగా పడిపోయాయి.

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
X

దిశ, వెబ్ డెస్క్ : అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు అనూహ్యంగా యూటర్న్ తీసుకున్నాయి. డాలర్ బలోపేతం కావడం, అమెరికా ట్రెజరీ బాండ్లపై రాబడులు పెరగడం వల్ల ఈ లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచాలని తీసుకున్న నిర్ణయం ద్రవ్యోల్బణ భయాలను పెంచడమే కాకుండా బంగారం, వెండిపై పెట్టుబడులు తగ్గడానికి ప్రధాన కారణమైంది.

మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీలో వెండి ధరలు భారీ పతనాన్ని నమోదు చేశాయి. కిలో వెండి ధర ఏకంగా 8 శాతం మేర క్షీణించి, ఒక్కరోజులోనే సుమారు రూ. 19 వేలు తగ్గి రూ. 2.29 లక్షలకు చేరుకుంది. బంగారం కూడా ఇదే బాటలో పయనిస్తూ 4 శాతం మేర తగ్గుముఖం పట్టింది. 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ. 6 వేల వరకు తగ్గి రూ. 1.46 లక్షల మార్కుకు పడిపోయింది. అంతర్జాతీయ స్పాట్ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర ప్రస్తుతం 4,682 డాలర్లు ఉండగా.. వెండి 70 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఈ ప్రభావంతో దేశీయంగానూ బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. కాగా గురువారం సాయంత్రం 4:50 గంటల సమయానికి హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ. 1.52 లక్షలుగా నమోదైంది. అలాగే కిలో వెండి రూ. 2.36 లక్షల వద్ద ట్రేడవుతోంది.

Next Story