ఇంధన ధరల పెంపుకు నిరసనగా దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల సమ్మె

by Malleboina Mahesh |

ఇంధన ధరల పెంపును నిరసిస్తూ దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు 5 గంటల పాటు సమ్మె చేపట్టారు. స్విగ్గీ, జొమాటో, ఓలా సేవలకు అంతరాయం కలిగింది.

ఇంధన ధరల పెంపుకు నిరసనగా దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల సమ్మె
X

దిశ, వెబ్ డెస్క్: అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (Central Govt) తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు (Gig workers) సంచలన నిర్ణయం తీసుకున్నారు. గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ (GIPSWU) పిలుపు మేరకు దేశంలోని ప్రముఖ ఆన్‌లైన్ సేవల సంస్థలైన స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో, ఓలా, ఉబెర్, రాపిడోలకు చెందిన డెలివరీ బాయ్స్, క్యాబ్, బైక్ టాక్సీ డ్రైవర్లు ఈ రోజు మధ్యాహ్నం 12:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు తమ యాప్‌లను ఆఫ్‌లైన్ చేసి విధులను బహిష్కరించారు. ఈ 5 గంటల తాత్కాలిక సమ్మె కారణంగా దేశంలోని ప్రధాన నగరాల్లో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలు, క్యాబ్ సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది.

దేశవ్యాప్తంగా దాదాపు 1.2 కోట్ల మంది గిగ్ వర్కర్లు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తుండగా.. ఇప్పటికే ఎండ తీవ్రత, ద్రవ్యోల్బణం తో ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ ఇంధన ధరల పెంపు (Fuel price hike) తమ ఆదాయంపై కోలుకోలేని దెబ్బ కొడుతుందని యూనియన్ ఆందోళన వ్యక్తం చేసింది. పెరిగిన చమురు ధరలకు అనుగుణంగా యాప్ ఆధారిత కంపెనీలు తమకు అదనపు 'ఫ్యూయల్ కాంపెన్సేషన్' (ఇంధన అలవెన్స్) అందించాలని, అలాగే డెలివరీ మరియు ట్రాన్స్‌పోర్ట్ వర్కర్లకు కనీస సేవా రుసుముగా కిలోమీటరుకు రూ. 20 (₹20/km) ఫిక్స్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మున్ముందు ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి.

Next Story