అప్పుల ఊబిలో బల్దియా

by Muthe.Rajitha |

ఒకప్పుడు అదనపు నిధులతో కళకళలాడిన జీహెచ్ఎంసీ ఇప్పుడు అప్పుల ఊబిలోకి నెట్టబడింది.

అప్పుల ఊబిలో బల్దియా
X

దిశ, తెలంగాణ బ్యూరో : జీహెచ్ఎంసీ అంటేనే ఫిక్స్‌డ్ డిపాజిట్ల(పీడీ)కు పెట్టిందిపేరు. 2013 వరకు ముందు జీహెచ్ఎంసీ పేరు మారుమోగింది. బల్దియా ఖజానాలో రూ.1000 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు(పీడీ) ఉండేవి. తెలంగాణ రాష్ట్రంలో జీహెచ్ఎంసీ నిధులను ఇతర శాఖలకు మళ్లించడంతో ఖజానా ఖాళీ అయింది. ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుంచి ఓవర్ డ్రాఫ్ట్(ఓడీ)కి చేరింది. అదనపు నిధులతో కళకళలాడిన జీహెచ్ఎంసీ అప్పుల ఊబిలోకి నెట్టబడింది. పదేండ్లలో నామమాత్రపు చెల్లింపులే. 2017 తర్వాత జీహెచ్ఎంసీకి సర్కార్ నుంచి ఎలాంటి సాయం అందలేదు. రూ.6 వేల కోట్ల అప్పులు చేసి ఫ్లైఓవర్లు నిర్మించారు. ప్రస్తుతం ఆ అప్పులు రూ.4,717 కోట్లకు చేరాయి. అయితే ఈ అప్పులను ప్రభుత్వం టేకోవర్ చేసుకుంటుందనే ప్రచారం జరుగుతున్నది. అంతేకాదు అప్పులకు సంబంధించిన వివరాలను అధికారులు ప్రభుత్వానికి పంపించారు. కానీ ప్రభుత్వం మాత్రం అప్పులను టేకోవర్ చేసుకోవడానికి సిద్ధంగాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఒక వేళ అప్పులను టేకోవర్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే రుణ పరిమితిపై ప్రభావం పడే అవకాశాలున్నందున బల్దియాకు రావాల్సిన బకాయిలను చెల్లించాలనే నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. అందులో భాగంగానే ప్రభుత్వ భవనాలకు సంబంధించిన ఆస్తిపన్ను బకాయిలను ఓటీఎస్ ద్వారా సర్దుబాటు చేసుకోవాలని కేబినెట్ సమావేశం నిర్ణయించింది.

ప్రభుత్వ భవనాల బకాయిలు రూ.5,864 కోట్లు

క్యూర్ పరిధిలోని జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ ఏరియాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భవనాలకు సంబంధించిన ఆస్తిపన్ను బకాయిలు రూ.6,375 కోట్లు ఉన్నాయి. అయితే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బకాయిలు రూ.5,864 కోట్లు ఉన్నాయి. అయితే వివిధ ప్రభుత్వ కార్యాలయాలు పన్నులను క్లియర్ చేసుకునేందుకు వన్ టైమ్ సెటిల్‌మెంట్ (ఓటీఎస్) వెసులుబాటు కల్పించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వన్ టైమ్ సెటిల్‌మెంట్ ద్వారా మూడు కార్పొరేషన్లకు రూ.1686 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది.

బకాయిలు భారీగా

జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ ఏరియాల్లో 28,80,260 ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్ మెంట్స్ ద్వారా రూ.14,686.6 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. వీటిలో ప్రభుత్వ భవనాల బకాయిలు రూ.5,864 కోట్లు ఉన్నాయి. ప్రయివేటు భవనాల ద్వారా రూ.8,734 కోట్లు రావాల్సి ఉందని అధికారులు అంచనా వేశారు. కానీ టార్గెట్ మాత్రం రూ.2,762 కోట్లు పెట్టుకున్నారు. అయితే 2026 మార్చి31 నాటికి రూ.2,558.80 కోట్లు వసూలైంది. గత నెల ఎర్లీ బర్డ్ స్కీమ్‌లో క్యూర్ పరిధిలోని జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలలో రూ.1,211 కోట్లు వసూలైంది. వీటిలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) రూ.510 కోట్లతో టాప్‌లో నిలిచింది. జీహెచ్ఎంసీలో రూ.441 కోట్లతో రెండో స్థానంలో ఉంది. ఎంఎంసీ రూ.260 కోట్లతో మూడో స్థానంలో నిలిచింది.

Next Story