ఎన్‌పీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా గవ్వల భరత్ కుమార్ నియామకం

by Muthe.Rajitha |

నేషనల్ పీపుల్స్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా గవ్వల భరత్ కుమార్‌ను పార్టీ జాతీయ నాయకత్వం నియమించింది.

ఎన్‌పీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా గవ్వల భరత్ కుమార్ నియామకం
X

దిశ, తెలంగాణ బ్యూరో : నేషనల్ పీపుల్స్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా గవ్వల భరత్ కుమార్‌ను పార్టీ జాతీయ నాయకత్వం నియమించింది. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలకు ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసిన ఆయన సేవలను గుర్తించి ఈ కీలక బాధ్యతలను అప్పగించినట్లు బుధవారం పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలను మరింత విస్తరించి ప్రజలకు చేరువ చేయడంలో గవ్వల భరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తారని పార్టీ నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు. యువతను రాజకీయాల్లోకి తీసుకురావడంలో ఆయన చేసిన కృషి ప్రత్యేకంగా గుర్తింపు పొందింది. గతంలో బీసీ జాతీయ సంక్షేమ సంఘంలో యువజన సంఘం, బీసీ విద్యార్థి సంఘాల్లో నాయకత్వం వహిస్తూ బీసీ వర్గాల హక్కుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. యువత సమస్యలపై నిరంతరం స్పందిస్తూ పలు ఉద్యమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా గవ్వల భరత్ కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన నేషనల్ పీపుల్స్ పార్టీ జాతీయ అధ్యక్షులు, మేఘాలయ ముఖ్యమంత్రి కోన్‌రాడ్ సంగ్మా, జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు జేమ్స్ సంగ్మా, జాతీయ ప్రధాన కార్యదర్శి పక్నా బాగే, జాతీయ యువజన సంఘం అధ్యక్షులు నీఖా నంక్ల తదితర నేతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. యువతను రాజకీయాల్లోకి తీసుకువచ్చి కొత్త నాయకత్వాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

Next Story