శ్రీలంక ప్రధాన కోచ్‌గా గ్యారీ కిర్‌స్టన్ నియామకం

by Malleboina Mahesh |

శ్రీలంక క్రికెట్ జట్టు కొత్త హెడ్ కోచ్‌గా గ్యారీ కిర్‌స్టన్ నియామకం. 2011 వరల్డ్ కప్ విన్నింగ్ కోచ్ రాకతో లంక జట్టులో కొత్త ఉత్సాహం.

శ్రీలంక ప్రధాన కోచ్‌గా గ్యారీ కిర్‌స్టన్ నియామకం
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల జరిగిన టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్ తో పాటు కో హోస్ట్ గా వ్యవహరించిన శ్రీలంక జట్టు (Sri Lanka team).. సూపర్ 8 లోనే వెనుదిరిగింది. దీంతో జట్టు ఓటమికి బాధ్యత వహిస్తూ కోచ్ పదవికి సనత్ జయసూర్య (Sanath Jayasuriya) రాజీనామా చేశారు. పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజం గ్యారీ కిర్‌స్టన్ (Gary Kirsten) నియమితులయ్యారు. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు (Sri Lanka Cricket Board) అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ కోచ్‌లలో ఒకరిగా పేరుగాంచిన కిర్‌స్టన్, గతంలో భారత జట్టును 2011 ప్రపంచ కప్ విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే దక్షిణాఫ్రికా జట్టును టెస్ట్ ర్యాంకింగ్స్‌ (Test rankings)లో అగ్రస్థానానికి చేర్చిన ఘనత కూడా ఆయనది. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ మెంటార్‌గా ఉండి, వారు తొలి ప్రయత్నంలోనే టైటిల్ గెలవడంలో ప్రధాన భూమిక పోషించిన అనుభవం ఆయనకు ఉంది.

యువ ఆటగాళ్లతో కూడిన శ్రీలంక జట్టుకు కిర్‌స్టన్ రాక గొప్ప బలాన్నిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. సాంకేతిక లోపాలను సరిదిద్దడం తో పాటు, ఆటగాళ్లలో మానసిక స్థైర్యాన్ని నింపడంలో ఆయనకు ఉన్న నేర్పు శ్రీలంక జట్టును మళ్లీ విజయపథంలోకి తీసుకెళ్తుందని బోర్డు ఆశాభావం వ్యక్తం చేసింది. 101 టెస్టులు, 185 వన్డేల అనుభవం ఉన్న కిర్‌స్టన్, శ్రీలంక క్రికెట్ బోర్డుతో కుదుర్చుకున్న ఈ ఒప్పందంతో త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నిర్వహించబోయే రాబోయే టోర్నమెంట్లే లక్ష్యంగా ఆయన తన ప్రణాళికలను సిద్ధం చేయనున్నారు.

Next Story