- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువకుడి లాకప్ డెత్.. 102 రోజుల తర్వాత అంత్యక్రియలు
తమిళనాడులో తీవ్ర సంచలనం సృష్టించిన లాకప్ డెత్ కేసులో ఒక విషాదకరమైన ఘట్టం చోటుచేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడులో తీవ్ర సంచలనం సృష్టించిన లాకప్ డెత్ కేసులో ఒక విషాదకరమైన ఘట్టం చోటుచేసుకుంది. పోలీసుల దెబ్బలకు తాళలేక మరణించిన 26 ఏళ్ల యువకుడు ఆకాష్ డెలిసన్ కుటుంబ సభ్యులు సుదీర్ఘ కాలంగా సాగిన న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో కోర్టు ఆదేశాల మేరకు ఏకంగా 102 రోజుల అనంతరం బుధవారం పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు. శివగంగై జిల్లా మానామదురైకి చెందిన ఆకాష్‌ను ఓ కేసు విషయమై విచారించేందుకు ఈ ఏడాది మార్చి 6న పోలీసులు తీసుకెళ్లగా, మార్చి 8న అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అతని శరీరంపై ఏకంగా 28 గాయాలున్నట్లు పోస్టుమార్టం నివేదికలో తేలడంతో ఇది తీవ్ర వివాదాస్పదమైంది.
ఈ లాకప్ డెత్ ఘటనపై హత్య కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసులు నమోదు కాగా, ఇన్‌స్పెక్టర్ దిలీపన్, ఎస్సై గుగన్‌తో పాటు నలుగురు కానిస్టేబుళ్లు సస్పెండయ్యారు. అయితే, బాధ్యులైన ఆరుగురు పోలీసులను తక్షణమే అరెస్టు చేయాలని, అలాగే తమ కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ బాధితుడి తండ్రి మదురై హైకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు కుమారుడి మృతదేహాన్ని తీసుకునేది లేదని పట్టుబట్టడంతో, గత 102 రోజులుగా ఆకాష్ భౌతికకాయాన్ని మదురై ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలోనే భద్రపరిచారు.
చివరికి ఈ వివాదంపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం, మృతదేహాన్ని అప్పగించేందుకు గడువు విధించినప్పటికీ తల్లిదండ్రులు ఆందోళనలు కొనసాగించడంతో కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆకాష్ మృతదేహానికి జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఆసుపత్రి డీన్ ఆధ్వర్యంలో ప్రభుత్వమే అంత్యక్రియలు నిర్వహించాలని న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు బుధవారం భారీ భద్రత నడుమ అధికారులు ఆకాష్ మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ ఘటన తమిళనాడులో పోలీసుల అరాచకాలు, వెనుకబడిన వర్గాల హక్కులపై దేశవ్యాప్తంగా మరోసారి పెద్ద చర్చకు దారితీసింది.






