సమ్మక్క-సారక్క బ్యారేజ్‌కు లైన్ క్లియర్!

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా చర్చల్లో ఉన్న సమ్మక్క-సారక్క బ్యారేజ్ (సమ్మక్క సాగర్) ప్రాజెక్టు మరోసారి వార్తల్లో నిలిచింది.

సమ్మక్క-సారక్క బ్యారేజ్‌కు లైన్ క్లియర్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా చర్చల్లో ఉన్న సమ్మక్క-సారక్క బ్యారేజ్ (సమ్మక్క సాగర్) ప్రాజెక్టు మరోసారి వార్తల్లో నిలిచింది. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయితో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జరిపిన సమావేశం ప్రాజెక్టు భవిష్యత్తుపై కొత్త ఆశలు రేకెత్తించింది. ముఖ్యంగా ప్రాజెక్టుకు అత్యంత కీలకమైన ఎన్ఓసీ జారీ విషయంలో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం వల్ల అనుమతుల ప్రక్రియలో ముందడుగు పడినట్లుగా అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గోదావరి జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన లక్ష్యంగా మారింది. కాళేశ్వరం, సీతారామ, పాలమూరు–రంగారెడ్డి వంటి భారీ ప్రాజెక్టులతోపాటు పెండింగ్‌లో ఉన్న పాత ప్రాజెక్టులను కూడా పూర్తి చేయాలనే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సమ్మక్క-సారక్క బ్యారేజ్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది.

పాత ప్రతిపాదనకు కొత్త రూపం

సమ్మక్క-సారక్క ప్రాజెక్టు ఆలోచన కొత్తది కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో పీవీ నరసింహారావు కంఠనపల్లి సుజల స్రవంతి పథకం కింద ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. గోదావరి నదిపై బ్యారేజ్ నిర్మించి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సార్ఎస్పీ) రెండో దశ ఆయకట్టుకు నీటి భద్రత కల్పించాలన్నదే ప్రధాన ఉద్దేశం. 2009లో ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతి లభించగా, 2012లో కేంద్ర జల సంఘం డీపీఆర్ తయారీకి సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాంకేతిక, ఆర్థిక అధ్యయనాల ఆధారంగా ప్రాజెక్టును పునఃరూపకల్పన చేశారు. మొదట ప్రతిపాదించిన కంఠనపల్లి ప్రాంతానికి బదులుగా ములుగు జిల్లా తూపాకులగూడెం వద్ద బ్యారేజ్ నిర్మించాలని నిర్ణయించారు. దీనివల్ల నిర్మాణ వ్యయం తగ్గడంతోపాటు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ముంపు ప్రభావం కూడా గణనీయంగా తగ్గిందని అధికారులు చెబుతున్నారు.

4.40 లక్షల ఆయకట్టు స్థిరీకరణ

రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు వర్షాధార వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నాయి. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సమ్మక్క-సారక్క బ్యారేజ్ ద్వారా గోదావరి నుంచి 46.96 టీఎంసీల నీటిని వినియోగించి ఎస్సార్ఎస్పీ స్టేజ్-2 పరిధిలోని 4.40 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. సాగునీరు అందక ఇప్పటికే ఉన్న ఆయకట్టులో రైతులు పంటలు సాగు చేయలేని పరిస్థితులు అనేక ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే రైతులకు నీటి లభ్యత పెరిగి పంటల ఉత్పాదకత గణనీయంగా మెరుగుపడే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్, జనగామ జిల్లాల్లోని లక్షల ఎకరాల భూములకు ప్రయోజనం కలగనుంది. ప్రస్తుతం సాగునీటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఇది శాశ్వత పరిష్కారంగా మారే అవకాశం ఉంది. మరోవైపు.. రామప్ప-పాకాల లింక్ కాలువ ద్వారా మరో 30 వేల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించనున్నారు. ములుగు జిల్లాలో 8వేల ఎకరాలు, నర్సంపేట ప్రాంతంలో 22వేల ఎకరాలకు ఈ కాలువ ద్వారా నీరు చేరే అవకాశం ఉంది.

దేవాదుల పథకానికీ మద్దతు

జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకంలోని కొంత ఆయకట్టును స్థిరీకరించడంలోనూ ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించనుంది. రాష్ట్రంలో ఇప్పటికే అమలులో ఉన్న నీటిపారుదల పథకాలకు ఇది అనుబంధంగా పనిచేస్తుంది. దీంతో గోదావరి జలాల వినియోగ సామర్థ్యం మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ బ్యారేజ్ నిర్మాణంతో వ్యవసాయానికే కాకుండా తాగునీటి అవసరాలను సైతం తీర్చనుంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని వందల గ్రామాలకు భవిష్యత్తులో తాగునీటి సరఫరా మెరుగుపడే అవకాశం ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లో నీటి కొరత సమస్యను తగ్గించడంలో ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుంది.

ఎన్‌వోసీకి లైన్ క్లియర్

ప్రస్తుతం ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న ప్రధాన అడ్డంకి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నుంచి రావాల్సిన ఎన్‌వోసీనే. కేంద్ర జల సంఘంలోని హైడ్రాలజీ, వ్యయ అంచనాలు, భూగర్భ జలాలు, గిరిజన వ్యవహారాలు తదితర విభాగాల నుంచి ఇప్పటికే అనుమతులు లభించాయి. అయితే.. అంతర్‌రాష్ట్ర వ్యవహారాల డైరెక్టరేట్ తుది ఆమోదం కోసం ఛత్తీస్‌గఢ్ ఎన్‌వోసీ తప్పనిసరి అయింది. అందుకే.. ప్రాజెక్టు వల్ల ముంపు ప్రభావిత ప్రాంతాలపై రెండు రాష్ట్రాల ఇంజినీర్లు సంయుక్తంగా సర్వేలు నిర్వహిస్తున్నారు. సర్వే ఖర్చుల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.9.883 కోట్లను విడుదల చేసింది. ముంపు ప్రభావిత భూములు గుర్తిస్తే చట్టప్రకారం పరిహారం చెల్లించేందుకూ తెలంగాణ ప్రభుత్వం సిద్ధమని ప్రకటించింది. రెండేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం నిరంతరంగా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నది. కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జల సంఘం స్థాయిలో కూడా పలుమార్లు చర్చలు జరిగాయి. ప్రస్తుతం సర్వే పనులు కొనసాగుతుండటం, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం, పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ముందుకు రావడం వంటి పరిణామాలు ఎన్‌వోసీ త్వరలో లభించే అవకాశాలు లేకపోలేదు. ఎన్‌వోసీ లభించిన వెంటనే కేంద్ర జల సంఘం తుది పరిశీలన పూర్తి చేసి ప్రాజెక్టుకు పూర్తిస్థాయి అనుమతులు ఇవ్వనుంది. అప్పుడు సమ్మక్క-సారక్క బ్యారేజ్ నిర్మాణానికి ఉన్న చివరి ప్రధాన పరిపాలనా అడ్డంకి సైతం తొలగిపోతుంది.

Next Story