ప్రీ లెఫ్ట్‌కు అడ్డుకట్ట.. ట్రాఫిక్‌కు తీవ్రమైన తిప్పలు

by Kodari Anjali |

నగరంలో అత్యంత రద్దీగా ఉండే నాగార్జునసాగర్ జాతీయ రహదారిపై ఆక్రమణలు అడ్డంకులు సృష్టిస్తున్నాయి.

ప్రీ లెఫ్ట్‌కు అడ్డుకట్ట.. ట్రాఫిక్‌కు తీవ్రమైన తిప్పలు
X

దిశ, హస్తినాపురం: నగరంలో అత్యంత రద్దీగా ఉండే నాగార్జునసాగర్ జాతీయ రహదారిపై ఆక్రమణలు అడ్డంకులు సృష్టిస్తున్నాయి. అక్రమంగా ఏర్పాటు చేసిన అడ్డంకులు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. హస్తినాపురం డివిజన్ పరిధిలోని సంతోషిమాత సిగ్నల్ చౌరస్తా వద్ద ఓ వ్యాపారి తన దుకాణం ముందు సిమెంట్‌తో నిర్మాణం చేసి, దానిపై భారీ గ్రానైట్ రాళ్లను రోడ్డుకు అడ్డంగా ఉంచాడు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది. ప్రతిరోజూ వేల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, బస్సులు ఈ మార్గంలో ప్రయాణిస్తుంటాయి. నెల రోజులుగా రోడ్డుపై ఉన్న ఈ అక్రమ అడ్డంకుల కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కేశవపురి కాలనీ వాసులు, స్థానికులు రోజువారీ రాకపోకల్లో ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఫ్రీ లెఫ్ట్‌కు అడ్డుకట్ట..

ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఏర్పాటు చేసిన ఫ్రీ లెఫ్ట్ మార్గానికి గ్రానైట్ రాళ్లు అడ్డుగా మారడంతో వాహనాల రాకపోకలు మందగిస్తున్నాయి. దీంతో చౌరస్తా వద్ద తరచూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. మరోవైపు రహదారి పూర్తిగా దెబ్బతిని గోతులు, గుంతలతో నిండిపోవడంతో వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతున్నది. గుంతల్లో నీరు నిల్వ ఉండడంతో ప్రమాదాల ముప్పు పొంచి ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల మౌనంపై విమర్శలు..

ప్రధాన రహదారిపై ఇంత స్పష్టంగా అక్రమ ఆక్రమణలు, ట్రాఫిక్‌కు ఆటంకాలు కనిపిస్తున్నప్పటికీ జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ శాఖ అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజల భద్రత, సౌకర్యాల కంటే నిర్లక్ష్యమే ఎక్కువగా కనిపిస్తోందని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారిపై ఉన్న అక్రమ అడ్డంకులను తొలగించడంతో పాటు దెబ్బతిన్న రోడ్డు మరమ్మతులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు, కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story