- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నరహరి అవినీతి కొండ!
సర్వే, భూ రికార్డుల శాఖ మల్టీ జోన్ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిరావు అవినీతి బాగోతం తీగ లాగితే డొంక కదులుతున్నది. ఆయన వెనక కొందరు ప్రభుత్వ అధికారులు ఉన్నట్టు స్పష్టమవుతున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: సర్వే, భూ రికార్డుల శాఖ మల్టీ జోన్ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిరావు అవినీతి బాగోతం తీగ లాగితే డొంక కదులుతున్నది. ఆయన వెనక కొందరు ప్రభుత్వ అధికారులు ఉన్నట్టు స్పష్టమవుతున్నది. ప్రజలకు సేవ చేయాల్సిన వివిధ శాఖల అధికారులు ఏకమై తమ అక్రమ సంపాదనతో ఏకంగా ఓ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని నిర్మించినట్టు సమాచారం. టీఎన్జీవోకు చెందిన పలువురు నేతలతో పాటు ఆదాయపు పన్ను, ఎక్సైజ్, జీహెచ్‌ఎంసీ అధికారులతో నరహరిరావు ఓ భారీ సిండికేట్‌గా ఏర్పడి నల్లధనాన్ని స్థిరాస్తి వ్యాపారంలోకి మళ్లించారు. ఈ నేపథ్యంలో సదరు అవినీతి అధికారుల కూటమికి కేంద్రంగా మారిన రియల్ ఎస్టేట్ సంస్థ, అందులో పెట్టుబడులు పెట్టిన అధికారుల ఆస్తులపై సమగ్ర విచారణ జరపాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తున్నది. ఈ వ్యవహారంపై ఏసీబీ, విజిలెన్స్ విభాగాలు లోతుగా దృష్టిసారిస్తే రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద అవినీతి కొండ బద్దలవడం ఖాయమని ప్రజాసంఘాలు పేర్కొంటున్నాయి.
బ్లాక్ మనీ టు వైట్ మనీ
అక్రమంగా గడించిన కోట్లాది రూపాయల నల్లధనాన్ని వైట్ మనీగా మార్చేందుకు ఈ అధికారుల సిండికేట్ గా ఏర్పడి పక్కా ప్రణాళిక రచించినట్టు తెలిసింది. నారాయణగూడలోని దుర్గామాత ఆలయం ఫ్లై ఓవర్ సమీపంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న రీమాక్స్ రియాల్టీ చాంపియన్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థలోకి వీరంతా తమ పెట్టుబడులను మళ్లించినట్లు సమాచారం. పలువురు ప్రస్తుత, మాజీ ప్రభుత్వ అధికారులు, వారి కుటుంబసభ్యుల పేర్లతో సంస్థలో భారీగా పెట్టుబడులు పెట్టినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంస్థకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, షేర్ హోల్డింగ్ నమూనాలు, పెట్టుబడుల మూలాలపై సమగ్రంగా దర్యాప్తు జరపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
తెరపైకి కీలక అధికారుల పేర్లు
నరహరిరావుతో కలిసి ఈ రియల్ ఎస్టేట్ దందాలో భాగస్వాములుగా ఉన్నారంటూ పలువురు అధికారుల పేర్లు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. వీరిలో మాజీ ఎక్సైజ్ అధికారి ఎ.సత్యనారాయణ, జీహెచ్‌ఎంసీ ఇంజినీర్ మహేశ్, ఆదాయపు పన్ను శాఖ ఇన్‌స్పెక్టర్ మర్రి వినోద్ రావు, జీహెచ్‌ఎంసీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కె.ప్రతాప్ తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు ప్రస్తుతం వరంగల్ రూరల్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారిగా పనిచేస్తున్న డి.అరుణ్ కుమార్‌పైనా ఈ వ్యవహారంలో పలు ఆరోపణలు వస్తున్నాయి. అరుణ్ కుమార్ సేవాకాలంలో సంపాదించిన ఆస్తులు, ఆయన అధికారిక ప్రవర్తన, రియల్ ఎస్టేట్ పెట్టుబడులపై లోతైన విజిలెన్స్ విచారణ జరిపించాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఈ అధికారులందరి ఆర్థిక లావాదేవీలు, బినామీ ఆస్తులు, బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తే విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తాయని తెలుస్తోంది.
భారీగా భూముల కొనుగోళ్లు
ఈ సిండికేట్ తమ రియల్ ఎస్టేట్ సంస్థ ద్వారా నగర శివార్లలో భారీగా భూ దందాలకు పాల్పడినట్టు సమాచారం. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా పరిధిలోని శంషాబాద్, షాద్‌నగర్, తుక్కుగూడ, శామీర్‌పేట్, చేవెళ్ల, మొయినాబాద్, దుండిగల్ తదితర అత్యంత విలువైన ప్రాంతాల్లో పెద్దఎత్తున భూములు కొనుగోలు చేయడం, భారీ వెంచర్లు వేయడం వెనక ఈ అధికారుల పెట్టుబడులే ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ భూ లావాదేవీల వెనక ఉన్న అసలు వ్యక్తులను గుర్తిస్తే రూ.వందల కోట్ల నల్లధనం బాగోతం బయటపడుతుందని భావిస్తున్నారు. ఎవరి పేరు వచ్చినా ఉపేక్షించకుండా, ముందుగానే ఓ నిర్ణయానికి రాకుండా ఏజెన్సీలు నిష్పాక్షికంగా విచారణ జరపాలని ప్రజలు కోరుతున్నారు.
పెట్టుబడులపై దర్యాప్తు
నరహరిరావు ఆస్తుల వ్యవహారంపై ఇప్పటివరకు సోదాల్లో లభించినవి కేవలం ప్రాథమిక వివరాలు మాత్రమే. ఇంకా ఆయన, ఆయన కుటుంబసభ్యులకు సంబంధించిన అదనపు ఆస్తులపై ధ్రువీకరణ కొనసాగుతున్నది. ఇతర అధికారులతో కలిసి చేసిన వ్యాపారాలు, బినామీ పేర్లతో ఉన్న ఆస్తులు, ఇతర మార్గాల్లో మళ్లించిన పెట్టుబడులపై అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నాం.
- గంగసాని శ్రీధర్, ఏసీబీ డీఎస్పీ






