నీట్’ పేరిట సైబర్ వల.. ప్రశ్నపత్రం ఉందంటూ సోషల్ మీడియాలో ప్రలోభాలు

by Ajay Maddhiboyina |

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ యూజీ -2026 పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల ఆశలను ఆసరాగా చేసుకుని కొన్ని మోసపూరిత ముఠాలు మళ్లీ వల విసురుతున్నాయి. ఈనెల 21న జరగబోయే నీట్ రీ-ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ తమ వద్ద ఉందంటూ సామాజిక మాధ్యమాల వేదికగా అక్రమార్కులు విద్యార్థులను ప్రలోభపెడుతున్నారు.

నీట్’ పేరిట సైబర్ వల.. ప్రశ్నపత్రం ఉందంటూ సోషల్ మీడియాలో ప్రలోభాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ యూజీ -2026 పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల ఆశలను ఆసరాగా చేసుకుని కొన్ని మోసపూరిత ముఠాలు మళ్లీ వల విసురుతున్నాయి. ఈనెల 21న జరగబోయే నీట్ రీ-ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ తమ వద్ద ఉందంటూ సామాజిక మాధ్యమాల వేదికగా అక్రమార్కులు విద్యార్థులను ప్రలోభపెడుతున్నారు. తాము చెప్పినట్లు చేస్తే చాలు మెడికల్ సీటు గ్యారెంటీ అంటూ సరికొత్త మోసాలకు తెరలేపారు. తమ వద్ద ఫ్రెష్‌గా లీక్ అయిన ఒరిజినల్ నీట్ పేపర్ ఉందంటూ కొందరు సామాజిక మాధ్యమాల్లో విద్యార్థులను, వారి కుటుంబాలను సంప్రదిస్తున్నారు. ప్రశ్నపత్రం కావాలంటే రూ. లక్షన్నర నుంచి రెండు లక్షల పైచిలుకు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. తాము ఎన్‌టీఏ వెబ్ అడ్మిన్‌లమని, సర్వర్ యాక్సెస్ తమ చేతుల్లోనే ఉందంటూ నమ్మిస్తున్నారు. ఎన్‌టీఏ అడ్మిన్ ప్యానెల్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్లను, కృత్రిమ మేధస్సు (ఏఐ) ద్వారా సృష్టించిన నకిలీ చిత్రాలను వాట్సాప్, స్నాప్‌చాట్ వేదికల్లో పంపిస్తూ విద్యార్థులను నిలువునా ముంచేందుకు ప్రయత్నిస్తున్నారు.

సైబర్ క్రైమ్ విభాగానికి భారీగా ఫిర్యాదులు..

అక్రమార్కుల ప్రలోభాలకు లొంగకూడదని భావించిన హైదరాబాద్‌కు చెందిన ఒక అభ్యర్థి ఎన్టీఏకు ఈ అంశంపై ఫిర్యాదు చేశాడు. అలాగే మెడికో పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మల్లోజు సత్యనారాయణ చారికి విషయం తెలియచేశాడు. ఈ మోసాల గురించిన పూర్తి వివరాలను, వాట్సాప్ సంభాషణల స్క్రీన్ రికార్డింగ్‌లను విద్యార్థి బహిర్గతం చేశాడు. చివరివరకు తనను ఒప్పించి డబ్బులు దండుకునేందుకు ప్రయత్నించారని వెల్లడించాడు. ఇలాంటి మోసాలపైన ఎన్టీఏ అధికార యంత్రాంగానికి, దేశవ్యాప్త సైబర్ క్రైమ్ విభాగానికి సైతం భారీగా ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా మల్లోజు సత్యనారాయణ చారి మాట్లాడుతూ... ‘ఎన్టీఏ అడ్మిన్ పేజీల పేరిట ఏఐ ఇమేజ్‌లు సృష్టించి మోసం చేసే క్రిమినల్ ముఠాలను అభ్యర్థులు ఎవరూ నమ్మవద్దని సూచించారు. ఇప్పటికే ఇలాంటి వారి వల్లే నీట్ పరీక్ష తీవ్ర వివాదాల్లో చిక్కుకున్నదన్నారు.

మోసగాళ్లకు కేంద్రం చెక్..

నీట్ పరీక్ష ముగిసేంత వరకు దేశవ్యాప్తంగా టెలిగ్రామ్ యాప్ యాక్సెస్, అలాగే మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌లపై కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక పరిమితులు విధించింది. పరీక్ష నిర్వహణలో ఏ చిన్న లోపానికి లేదా పేపర్ లీకేజీ భ్రమలకు అవకాశం ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకుందని విద్యా రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. టెలిగ్రామ్‌లోని పాత మెసేజ్‌లను ఎడిట్ చేస్తూ.. తాము పరీక్షకు ముందే లీక్ చేశామంటూ తప్పుడు ఆధారాలు సృష్టించే ‘పేపర్ లీక్ మాఫియా’ ఎత్తుగడలకు కేంద్రం ఈ పరిమితులతో గట్టి చెక్ పెట్టింది. అత్యంత సురక్షితమైన ఎన్టీఏ అధికారిక వ్యవస్థను దాటి నీట్ ప్రశ్నపత్రం బయటకు వచ్చే అవకాశమే లేదని, సామాజిక మాధ్యమాల్లో ప్రచారమయ్యే లీకేజీ వదంతులను అభ్యర్థులెవరూ నమ్మవద్దని స్పష్టం చేసింది. పరీక్షల నిర్వహణపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకుని ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష రాయాలని విద్యా రంగ నిపుణులు, మెడికో పేరెంట్స్ అసోసియేషన్ పిలుపునిచ్చాయి.

Next Story