అభివృద్ధి పేరుతో అక్రమాలు.. నిబంధనలు తుంగలో తొక్కి నిధులు కేటాయింపు!

by Jakkula.Mamatha |

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అక్రమ దందాలకు అడ్డాగా మారింది అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

అభివృద్ధి పేరుతో అక్రమాలు.. నిబంధనలు తుంగలో తొక్కి నిధులు కేటాయింపు!
X

దిశ, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అక్రమ దందాలకు అడ్డాగా మారింది అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వాలు మారిన పాలకవర్గంలో కొంతమంది సభ్యులు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరుతూ అధికారం చెలాయించడంతో అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వాలు పట్టణ అబివృద్ధి కోసం కేటాయించిన నిధులను కమీషన్ల కోసం దారి మళ్లిస్తున్నారు. అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిధులనులను అభివృద్ధి పనులకే కేటాయిస్తూ పర్యవేక్షించాల్సిన అధికారులు కమిషన్లకు కక్కుర్తి పడుతూ పాలకవర్గం చేతిలో కీలు బొమ్మల్లా వ్యవహరిస్తూ అక్రమాలకు ఆజ్యం పోయడంతో ఓకే పనికి వివిధ పథకాల్లో నిధులు కేటాయిస్తూ నిబంధనలను తుంగలో తొక్కేస్తున్నారు. దీంతో నగరపాలక సంస్థ పరిధిలో సమస్యలు శాశ్వతంగా పరిష్కారానికి నోచుకోక పోగా ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టిస్తూ పాలకవర్గంలో పాతుకుపోతున్న పరిస్థితి కరీంనగర్ నగరపాలక సంస్థలో నెలకొందనే చర్చ జరుగుతుంది.

నిబంధనలు ఉల్లంఘిస్తూ నిధుల కేటాయింపు..

కేంద్ర ప్రభుత్వం యూఐడీఎఫ్ అనే పథకాన్ని 2023-24లో బడ్జెట్‌లో ప్రకటించింది. ఇది ప్రధానంగా టైర్ -2, టైర్ -3 పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి నిధులు అందించడానికి రూపొందించబడింది. ఈ నిధులను నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నిర్వహిస్తుంది. జనాభా 50,000 వేల నుంచి 9,99,999 వరకు ఉన్న టైర్ -2, టైర్-3 పట్టణాలు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, అర్బన్ లోకల్ బాడీలు ఈ నిధులను వినియోగించవచ్చు. నిబంధనల ప్రకారం యూఐడీఎఫ్ కింద సాధారణంగా తాగునీటి సరఫరా, మురుగు నీటి కాలువలు, డ్రైనేజీ అండ్​ స్టార్మ్ వాటర్ డ్రైన్లు, ఘన వ్యర్థాల నిర్వహణ కొత్త రోడ్ల నిర్మాణం అండర్‌పాస్‌లు, ఓవర్‌బ్రిడ్జ్‌లు, పార్కులు, ఏరియా డెవలప్‌మెంట్ ప్రాజెక్టులు పనులకు నిధులు ఉపయోగ పడేందుకు ప్రభుత్వం పథకాన్ని తీసుకొచ్చింది అయితే పాలకవర్గాలు ఈ పథకాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం దారి మళ్లిస్తూ ప్రభుత్వం కేటాయించిన పనులకు కాకుండా ఇతర పనులకు కేటాయించడం వివాదస్పదంగా మారింది. ప్రజలు ప్రభుత్వాలు మారిన శాశ్వతంగా పరిష్కారం కాకుండా ఉంటున్న సమస్యలతో కరీంనగర్ నగర ప్రజలు నిత్యం సతమతమవుతున్నారు .

పక్కదారి పడుతున్న ప్రభుత్వ నిధులు..

నిబంధనలకు విరుద్ధంగా నిధులను కేటాయిస్తున్న అధికారులు ఓకే పనికి వివిధ పథకాల్లో ప్రత్యేక ఫండ్‌ను కేటాయిస్తూ అభివృద్ధి పనులను కాస్త అక్రమాలకు దారి మళ్లిస్తున్నారు అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా కరీంనగర్ కార్పొరేషన్ లో ఓ అధికారులు పాతుకుపోయిన పాలక వర్గ సభ్యుడి సూచనతో నిబందనలకు విరుద్ధంగా నిధులు కేటాయించారు. యూ‌ఐడీ‌ఎఫ్ ఫండ్ లో భాగంగా E1/DB/MCK/8201/263/2026-27/51 అనే టెండర్ నోటీసుతో 50 లక్షల పని కోసం టెండర్ పిలిచిన అదికారులు ఈ పనిలో నిబంధనలకు విరుద్ధంగా నగరంలోని ఓ డివిజన్ లో హనుమాన్ టెంపుల్ లో టైల్స్, పెయింటింగ్, ప్లాస్టరింగ్, బ్రిక్ వర్క్ మరియు ఇతర పనుల కోసం నిధులు కేటాయించడం వివాదస్పదంగా మారి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి . అయితే నగర పాలక సంస్థ కమిషనర్ సైతం అధికార దుర్వినియోగానికి పాల్పడి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ మరియు సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు సాంకేతిక అనుమతులు ఇవ్వడం పై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి

అభివృద్ధి వద్దు ఆధ్యాత్మికమే ముద్దు..

ప్రభుత్వం పట్టణాల అభివృద్ధి కోసం పలు ఫథకాలను ప్రవేశపెట్టి విధులు కేటాయిస్తూ నిబంధనలను అమలు చేస్తుంటే కరీంనగర్ కార్పొరేషన్‌లో అదికారులు పాలకవర్గ సభ్యులు అభివృద్ది పక్కనపెట్టి ఆధ్యాత్మికమే ప్రదానం అన్నట్టుగా నిధులు కేటాయించడం పై నగర ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఏళ్ల తరబడి పేరుకుపోతుంటే కొత్తగా నగరంలో పలు గ్రామాలను విలీనం చేసిన అదికారులు అభివృద్ధి పనులను పక్కకు పెట్టి ప్రభుత్వ నిబంధనలను పక్కన పెట్టి ఆలయాలను అభివృద్ధి చేస్తున్నాం అంటూ ఓకే పనికి పలురకాల పథకాల కింద పలుమార్లు నిధులు కేటాయించడం పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి అయితే సాంకేతిక అనుమతులు ఇస్తు పనులు పర్యవేక్షించాల్సిన అధికారులు కూడా పట్టించుకోకుండా నిధులను కేటాయించడం పై అనుమానాలు వ్యక్తం అవుతు లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

డిజైన్లు డివిజన్లు మార్చుతూ నిధుల కేటాయింపు..

ప్రభుత్వ అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తూ నిధులు కేటాయించాల్సిన అధికారులు చేతివాటం ప్రదర్శించడంతో కాగితాలపై అభివృద్ధి పనుల డిజైన్ మార్చుతూ నిధులను కేటాయిస్తున్నారు. అందుకు నగరంలోని ఓ ఆలయం వేదిక కాగా పాలకవర్గంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఓ నాయకుడు సూత్రధారిగా నిధుల కేటాయింపు జరిగింది అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సదరు నాయకుడు ఏ పార్టీ అధికారంలో ఉన్న ఆ పార్టీ కండువా కప్పుకుని కీలకంగా వ్యవహరించడంతో అదికారులు సైతం జీ హుజూర్ అంటూ అతగాడి పనులు ఏ అడ్డంకి లేకుండా చేస్తున్నట్టు నగరపాలక సంస్థలో అధికారులు బాహటంగా చెబుతుండటం కరీంనగర్ నగరపాలక సంస్థలో ప్రత్యేకం.

నిధుల మీద సోషల్ ఆడిట్ జరిపించాలి..

ఒకే పనికి వివిధ స్కీమ్ లలో పరిపాలన మరియు సాంకేతిక అనుమతులు ఇవ్వడం లో బల్దియా కమిషనర్ నిబంధనలు తుంగలో తొక్కి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఒక్క బల్దియా నిధులే కాకుండా పంచాయతీ రాజ్ శాఖలో కూడా ఈ ఏరియా లో హనుమాన్ టెంపుల్ అభివృద్ధి కోసం టెండర్లు అయ్యాయని సమాచారం. ఇప్పటి వరకు భగత్ నగర్ మరియు గోదాం గడ్డలలో ఉన్న హనుమాన్ టెంపుల్‌ల అభివృద్ధి పేరిట కేటాయించబడిన బల్దియా నిధులు మరియు ఖర్చు చేసిన నిధుల మీద సోషల్ ఆడిట్ జరిపించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Next Story