- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు : ఎస్టీయూటీఎస్
దేశవ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (ఎస్టీయూ టీఎస్) తన సంపూర్ణ మద్దతు తెలిపింది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ నెల 12 న కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (ఎస్టీయూ టీఎస్) తన సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి. సదానందం గౌడ్, ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ ఒక ప్రకటన లో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక, పారిశ్రామిక విధానాల వల్ల సామాన్య ప్రజలు, కార్మిక వర్గం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు విమర్శించారు. జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు జరుగుతున్న ఈ ఒకరోజు సమ్మె ద్వారా తమ నిరసనను గళమెత్తనున్నట్లు తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలనీ, కార్మికులకు, ఉద్యోగులకు పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలను అమలు చేయాలనీ డిమాండ్ చేశారు.
కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించి వారికి తగిన ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ప్రస్తుతం ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని (సీపిఎస్) రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనీ కోరారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు బడ్జెట్‌లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలన్నారు. ఈ సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు, కార్మికులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఎస్టీయూటీఎస్ నేతలు పిలుపునిచ్చారు.






